బుర్రకు ఎక్కింది లేదు. చదవు వచ్చింది లేదు. కానీ ఫీజులు కట్టాలంటూ నోటీసులు మాత్రం వచ్చేశాయి. అసలే లాక్‌డౌన్ దెబ్బకు విలవిలలాడుతున్న సామాన్యులపై ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు ఫీజుల కొరడా ఝుళిపిస్తున్నాయి. ఫీజు కట్టకుంటే కనెక్షన్ కట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు పిల్లలకు అర్థమవ్వడం లేదని తల్లిదండ్రులు నెత్తినోరు మొత్తుకుంటుంటే ఇప్పుడు ఫీజులు కట్టాలంటూ కాల్స్ రావడంతో ఇదెక్కడ గోసరా నాయనా అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఆన్‌లైన్ క్లాసులపేరుతో ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ స్కూళ్ల తీరుపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ ఫోకస్.
ఆన్ లైన్ క్లాసులు విద్యార్థుల తల్లిదండ్రులకు శాపంగా మారాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఎంతో ఇబ్బందులు పడుతున్న పేరెంట్స్‌ను స్కూల్ యజమాన్యాలు ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విద్యార్ధులకు లింకులు ఆపివేస్తూ ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని తేల్చి చెప్పేస్తున్నాయి. ఇయర్ ఎండ్ రావడంతో ప్రతి కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం టీచర్ల సాయంతో ఇదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తూ ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి.
మొదట విద్యార్థులందరికీ ఆన్‌లైన్ క్లాస్ లింకులు చొరవ తీసుకుని పంపిన యాజమాన్యాలు క్రమంగా ఫీజులు చెల్లించాలని బోధన సిబ్బందితో ఒత్తిడి చేయడం మొదలుపెట్టాయి. దీంతో మెజారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమేర చెల్లించినా సమ్మెటివ్ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో పూర్తి ఫీజులు చెల్లించాలని తీవ్ర ఓత్తిడికి గురి చేస్తున్నాయి. స్కూల్స్ యజమాన్యాలు లింకులు ఆపివేయటంతో తమ తోటి విద్యార్ధుల కంటే వెనుకపడుతున్నామని అటు విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంతో పోలిస్తే స్కూల్ నిర్వహణకు అంతగా ఖర్చులు లేనపుడు పూర్తి ఫీజుల కోసం ఎందుకు ఒత్తిడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. ఇదిలా ఉంటే అసలు ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులకు ఏమీ అర్థం కావటం లేదంటున్నారు పేరెంట్స్. ఫిజికల్ క్లాసులే పిల్లలకు బెటర్ అంటున్నారు. స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఇప్పటివరకు 35 శాతం కూడా ఫీజులు కట్టకపోతే నిర్వహణ ఎలా అంటున్నారు. సిబ్బంది వేతనాలు, బిల్డింగ్ నిర్వహణ కోసమే ఫీజులు అడుగుతున్నామంటున్నారు. పూర్తి ఫీజు కాకపోయినా తల్లిదండ్రులు కనీస మొత్తాన్నైనా చెల్లించాలంటున్నారు.