Telangana: తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూ

Telangana: తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు.

Update: 2021-06-03 11:21 GMT

డీహెచ్‌ శ్రీనివాస్‌రావు(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆఫీస్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు క్యూకడుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా ఝళిపిస్తోంది. కొవిడ్‌ చికిత్స లైసెన్స్‌ రద్దు చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తుంది.

డీహెచ్‌ శ్రీనివాస్‌రావుతో ఆయా ఆసుపత్రుల యజమానులు వేర్వేరుగా భేటీ అవుతున్నారు. తమ ఆస్పత్రులకు కొవిడ్ లైసెన్స్‌ రద్దు చేయడంపై ఆరా తీశారు. ఫిర్యాదు చేసిన పేషెంట్స్‌ బిల్‌ కాపీలను డీహెచ్‌కు మరోసారి అందజేశారు. తమ ఆస్పత్రులను మంచి రెప్యుటేషన్‌తో నడుపుకుంటున్నామని అది పోవాలని కోరుకోవడం లేదని వారు స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు, కొవిడ్ లైసెన్స్ రద్దుపై న్యాయ పోరాటం చేస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున లైసెన్స్ రద్దు చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారని డీహెచ్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు, ప్రతినిధులు వివరించారు.

తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆ ఆసుపత్రులపై ప్రజల నుంచి 174 ఫిర్యాదులు వచ్చాయని, 21 ఆసుపత్రులకు కరోనా చికిత్సల అనుమతులు రద్దు చేశామని డీహెచ్‌ హైకోర్టుకు వెల్లడించారు. ఆసుపత్రుల కొవిడ్‌ చికిత్సల లైసెన్స్‌ రద్దు చేస్తే సరిపోతుందా? ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఛార్జీలు బాధితులకు తిరిగి చెల్లించాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్స్‌ల రద్దు కన్నా ముఖ్యం బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించడమని ధర్మాసనం స్పష్టం చేసింది. అధికంగా వసూలు చేసిన ఛార్జీలు తిరిగి ఇవ్వకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించాలని హైకోర్టు సూచించింది. లైసెన్స్‌లు రద్దు చేశాక ఆసుపత్రులు బాధితులకు సొమ్ము తిరిగి ఇవ్వకుండా మొండికేస్తాయి కదా!. మెడపై కత్తిపెట్టి డబ్బులు ఇప్పించాలి కానీ... తల నరికేస్తే ఏం లాభం'' అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

బాధితులకు ఛార్జీలు తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్‌ వివరణ ఇచ్చారు. మొదటి దశ కరోనా సమయంలో రూ.3కోట్లు బాధితులకు ఇప్పించామని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలు ఖరారు చేశారా? అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మొదటి దశలోనే గరిష్ఠ ధరలు ఖరారు చేస్తూ జీవో ఇచ్చామని డీహెచ్‌ తెలపగా రెండో దశలో ఎందుకు సవరించలేదని హైకోర్టు ప్రశ్నించింది. గరిష్ఠ ధరలు మరోసారి సవరిస్తామని డీహెచ్‌ వివరణ ఇవ్వగా గరిష్ఠ ధరలు ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టి అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News