Online Classes: ఆన్‌లైన్‌ క్లాసులతో చిన్నారులపై ఒత్తిడి

Online Classes:*గంటల తరబడి మొబైళ్లను చూస్తున్న చిన్నారులు. *కంటి చూపు మందగిస్తుందంటూ వైద్యుల హెచ్చరిక.

Update: 2022-01-19 07:46 GMT

ఆన్‌లైన్‌ క్లాసులతో చిన్నారులపై ఒత్తిడి...

Online Classes: కరోనా కల్లోలానికి అన్ని రంగాలు కుప్పకూలాయి. అందులో ప్రధానమైనది విద్యా రంగం. 2020 మార్చి ఆఖరు నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమవడంతో ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలపై ఆధారపడక తప్పనిపరిస్థితి.. ఇది చిన్నారుల కంటిచూపుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ తరగతులకే ప్రాధాన్యమిస్తున్నాయి. అందులో భాగంగా నిత్యం నాలుగున్నర గంటలకు పైగా తరగతులు నిర్వహిస్తున్నాయి. వాట్సాప్‌ గ్రూపుల్లో హోంవర్క్‌ వివరాలు పంపుతున్నాయి. దీంతో విద్యార్థులు ఎక్కువ సమయం మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది చిన్నారుల కళ్లపై తీవ్ర ప్రభావమే చూపుతోందని కంటి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ల్యాప్‌టాప్‌, కంప్యూటర్, ట్యాబ్‌లు కొనలేని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా మొబైళ్లనే కొంటున్నారు. అయితే మొబైళ్ల స్క్రీన్లు మరీ చిన్నవిగా ఉండడంతో అక్షరాలు, చిత్రాలను తదేకంగా చూడాల్సి వస్తోంది. దీంతో పాటు గంటల తరబడి క్లాసులను ఆ చిన్న స్క్రీన్లను చూస్తుండడంతో ఎక్కువ మంది చిన్నారుల్లో ఇప్పుడు దృష్టిలోపం సమస్య తీవ్ర మవుతోంది.

ఎదిగే వయస్సులో చిన్నారుల కళ్లపై తీవ్రమైన ఒత్తడి పడుతోంది. ఈ కారణంగా చూపు మందగిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల సెలవులను పొడిగించింది. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

తదేకంగా ఎలక్ట్రానిక్‌ స్క్రీన్లను చూడడంతో కంటితో పాటుతల, మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంధని వైద్యులు చెబుతున్నారు. తరగతులు జరుగుతున్న సమయంలో ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కళ్లకు 10 నిమిషాల విశ్రాంతిని తల్లిదండ్రులు కల్పించాలని సూచిస్తున్నారు. విటమిన్‌-ఏ అధికంగా ఉండే గుడ్డు, పాలు, క్యారెట్‌, బొప్పాయి, ఆకు కూరలు పిల్లలకు అధికంగా అందించాలంటున్నారు. చిన్నారులను తగినంత నిద్ర పోనివ్వాలని చెబుతున్నారు.

తరగతులు పూర్తయిన తరువాత వీడియో గేమ్స్‌ వంటివి చిన్నారులు ఆడుతుంటారు.. వాటికి పూర్తిగా తల్లిదండ్రులు అడ్డుకట్ట వేయాలని సూచిస్తున్నారు. పచ్చదనం ఉండే ప్రాంతాల్లో చిన్నారులను ఆటలు ఆడించాలని చెబుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే.. కళ్లకు ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News