గిరిజన పుత్రుల అవస్థలు... గర్భిణీని తరలించేందుకు అష్టకష్టాలు...
Bhadradri Kothagudem: అశ్వాపురంపాడుకు చెందిన దేవికి పురిటినొప్పులు
Bhadradri Kothagudem: 75ఏళ్ల స్వతంత్ర భారతావనిలో పల్లె ప్రగతి ప్రపంచాన్ని దాటుతుందంటూ దేశ కీర్తిని ఆకాశానికి ఎత్తుతున్న పాలకుల ప్రసంగాలు మాటలకే పరిమితమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల చేరువలో ఉన్న ఆదివాసీ గిరిజన గ్రామానికి కనీస రోడ్డు సదుపాయం లేదు. దీంతో ఓ నిండు గర్భిణీ కష్టం పలువురిని కలిచివేసింది. అశ్వాపురంపాడుకు చెందిన పొడియం దేవికి పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించేందుకు గ్రామస్తులు పడ్డ కష్టం వర్ణాణాతీతం. రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్లాస్టిక్ కుర్చీని డోలిగా మార్చి.. సుమారు 3 కిలోమీటర్ల మేర అడవి బాటలో మోసుకుంటూ వెళ్లారు గ్రామస్థులు, బంధువులు.
అదృష్టం కొద్ది కరకగూడెం తాడ్వాయి వద్దకు అంబులెన్స్ రావడంతో గర్భిణీని అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇప్పటికైనా గిరిజనుల కోసం, వారి అభివృద్ధి కోసం అధికారులు పనిచేయాలని కోరుతున్నారు గిరిజన పుత్రులు. తక్షణమే గిరిజన గ్రామాలను సందర్శించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.