ప్రణయ్ హత్య కేసు చార్జీషీట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 12 వందల పేజీల చార్జీషీట్ ను పోలీసులు దాఖలు చేశారు. 102 మంది సాక్షులను విచారించారు. చార్జీషీట్ లో మారుతీరావు సహా 8 మంది నిందితుల పేర్లు వున్నాయి. కేసులో A1గా మారుతీరావు, A6గా శ్రవణ్ పేర్లు వున్నాయి. ప్రణయ్ హత్యపై అతడి భార్య అమృత 6 పేజీల స్టేట్ మెంట్ ఇచ్చింది.
ప్రణయ్ హత్య సమయంలో అమృత ఆరు పేజీల స్టేట్ మెంట్ ఇచ్చింది. స్కూలులో చదువుతున్నప్పుడే ప్రణయ్ తో పరిచయం ప్రేమకు దారితీసిందని 10వ తరగతిలో ఉండగా తమ ప్రేమను తండ్రి నిరాకరించాడని అమృత స్టేట్ మెంట్ లో పేర్కోంది. ప్రణయ్ ది తక్కువ కులం కావడంతో ఆతనితో మాట్లాడవద్దని తండ్రి బెదిరించినట్లు అమృత స్టేట్ మెంట్ లో పేర్కొంది చదువు మధ్యలో ఆపేయించారని, ఇంట్లోనే బందీని చేశారని తనను బాగా కొట్టారని అమృత చెప్పింది. ప్రణయ్ నుబెదిరించి పంపేశారని తన ఒత్తిడితోనే ప్రణయ్ తనను పెళ్లిచేసుకున్నాడని అమృత వివరించింది.
2018 జనవరి 30న హైదరాబాద్ ఆర్యసమాజ్ లో వారి పెళ్లి జరిగింది అమృతపై మిర్యాలగూడలో మారుతీ రావు మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు వారిని మిర్యాలగూడ తీసుకొచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో అమృత ప్రణయ్ ఇంట్లో ఉండేందుకు సిద్ధపడింది. 2018 ఆగస్ట్ 17న ఇద్దరి పేరిట ప్రణయ్ తల్లి దండ్రులు గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చారు. అయితే కుమార్తె పెళ్లిని ఇష్టపడని మారుతీ రావు ప్రణయ్ పై పగ పెంచుకున్నాడు. ప్రణయ్ ను చంపేస్తానని హెచ్చరించిన మారుతీరావు 2018 సెప్టెంబర్ 14న కిరాయి రౌడీలతో హత్య చేయించాడు. గర్భవతి అయిన అమృత భర్తతో కలిపి చెకప్ కోసం జ్యోతీ ఆస్పత్రికి వెడుతున్న సమయంలో ఈ హత్య జరిగింది.
తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుని కుమార్తె పరువు తీసిందని అందుకే ప్రణయ్ ను చంపాలని నిర్ణయించినట్లు మారుతీరావ్ తన స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. హత్యకు డబ్బు అవసరం అవుతుంది కాబట్టి తమ్ముడి శ్రవణ్ కి చెప్పి డబ్బు సమకూర్చమని కోరినట్లు మారుతీరావ్ ప్రకటనలో అంగీకరించాడు. మరోవైపు అమృత కులాంతర వివాహంతో తమ పరువు పోయిందని హత్యకు డబ్బు సమకూర్చమని అన్న కోరడంతో చింతపల్లి క్రాస్ రోడ్డు దగ్గరున్న ప్లాట్ అమ్మి డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేసినట్లు శ్రవణ్ పోలీసులకిచ్చిన స్టేట్ మెంట్ లో తెలిపాడు. తమ కుమారుడిని పథకం ప్రకారమే హత్య చేశారని ప్రణయ్ తండ్రి బాలస్వామి కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ, అహ్మద్ భారీ, కరీం, శివ, నిజాం కోర్టుకు హాజరయ్యారు. కేసులో ఏవన్ గా ఉన్న మారుతీ రావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.