Pottery Professionals: కులవృత్తి దారులకు ఆదర్శంగా నర్సాపూర్ గ్రామం
Pottery Professionals: కులవృత్తి దారులకు ఆదర్శంగా నిలుస్తున్న నారాయణపేట జిల్లా నర్సాపూర్ గ్రామం
Pottery professionals: ఈ ఆధునిక యుగంలో కుండల వాడకం తగ్గిపోవడంతో కుమ్మరి వృత్తిదారులకు ఉపాధి కరవైంది. అన్ని గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... ఆ గ్రామంలో మాత్రం చేతినిండా పని ఉంది. ట్రెండ్ కు తగ్గట్లు తందూరీ బట్టీలు, బిర్యాణీ కుండలను తయారుచేస్తున్నారు. దేశ, విదేశాలకు సప్లయి చేసి లాభాలు గడిస్తున్నారు. కులవృత్తి దారులకు ఆదర్శంగా నిలుస్తున్న నారాయణపేట జిల్లా నర్సాపూర్ గ్రామంపై హెచ్ఎంటీవి స్పెషల్ స్టోరీ.
తందూరీ బట్టీలతో పాటు బిర్యాణీ కుండలు..
నారాయణ పేట జిల్లా నర్సాపూర్ లో తందూరీ బట్టీలతో పాటు బిర్యాణీ కుండలను తయారుచేస్తారు కుమ్మరి వృత్తిదారులు. సమీప చెరువు నుంచి మట్టిని తీసుకొస్తారు. ఒక్కో బట్టీ తయారీకి ఐదు రోజులు పడుతుంది. మట్టి తో పాటు ఇనుము, కాపర్ లతో బట్టీలు ఉంటాయి. మట్టి బట్టీలను నర్సాపూర్ లో తయారుచేస్తే ఇనుము, కాపర్ బట్టీల ఆర్డర్ తీసుకుని వేరే ప్రాంతాల్లో తయారుచేయించి సప్లయి చేస్తారు. మట్టి బట్టీ ధర సైజ్ ను 300 నుంచి మూడు వేల వరకు, ఇనుము, కాపర్ బట్టీ ధర పదివేల నుంచి 50 వేల వరకు ఉంటుంది.
బిర్యాణీ కుండలకు మంచి డిమాండ్...
నర్సాపూర్ లో తయారైన బట్టీలు, బిర్యాణీ కుండలకు మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక, తమిళనాడులకు ఎగుమతి అవుతాయి. విదేశాలకు కూడా పంపిస్తున్నారు. ప్రతి నెల 80 బట్టీలు సప్లయి చేస్తున్నారు. నర్సాపూర్ లో 20 మంది బట్టీ తయారీపై ఉపాధి పొందుతున్నారు. నెలకు 15 వేల ఆదాయాన్నిపొందుతున్నారు. ఏడాదిలో ఆరేడు నెలలే పని ఉంటుంది. వాన కాలంలో పని ఉండదు.
స్టీల్, ఇనుము, రాగి బట్టీల ఆర్డర్ తీసుకుని...
నర్సాపూర్ లో కేవలం మట్టిబట్టీలే తయారవుతాయి. స్టీల్, ఇనుము, రాగి బట్టీల ఆర్డర్ తీసుకుని ఇతర ప్రాంతాల్లో తయారుచేయించి సప్లయి చేస్తున్నారు. బట్టీ తయారీ పరిశ్రమను నర్సాపూర్ లో ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. తందూరీ బట్టీలు, బిర్యాణీ కుండలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. వీటి తయరీ పరిశ్రమను నర్సాపూర్ లో ఏర్పాటు చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎంతో మందికి ఉపాధి లభించడం ఖాయం.