తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

తెలంగాణలో ముగిసిన మహాఘట్టం

Update: 2024-05-13 14:21 GMT

 తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

 తెలంగాణలో ఎన్నికల మహాఘట్టం పూర్తిఅయింది. చెదురుమదురు ఘటనలు మినహా... తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అయితే క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు అధికారులు ఓట్లు వేసేందుకు అనుమతిస్తున్నారు. మిగతా చోట్ల పార్టీ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ ఎన్నికల అధికారులు సీల్ వేశారు.

తెలంగాణలో ఇవాళ జరిగిన పోలింగ్ సరళిని ఒకసారి పరిశీలిస్తే... ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఈసీ తెలిపింది. 11 గంటల వరకు 24.31 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 40.38 శాతం, మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదవగా..సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత... క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల్లో పోలింగ్ శాతం పరవాలేదనిపించినా.... రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం గతం మాదిరిగానే ఓటింగ్‌కి ప్రజలు దూరంగా ఉన్నారు.

తెలంగాణలోని రాజకీయ నాయకులు ఆయా ప్రాంతాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంప‌తులు కొడంగ‌ల్‌లోని హైస్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో త‌మ ఓటు వేశారు. రేవంత్ త‌న భార్య గీతా రెడ్డితో పాటు కూతురు నీమిషాతో క‌లిసి పోలింగ్ సెంట‌ర్‌కు వెళ్లి ఓటు వేశారు. తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చింత‌మడ‌క‌లో ఓటు వేశారు. త‌న భార్య శోభ‌తో క‌లిసి చింత‌మ‌డ‌క పోలింగ్ కేంద్రానికి వెళ్లి కేసీఆర్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. బర్కత్‌పురాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు సెలబ్రెటీస్ తరలివెళ్లారు. బాధ్యతగా ఓటేసి సామాన్య ఓటర్లకు.. ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవి దంపతులు.. ఓటేశారు. ఓటును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అది మన బాధ్యత అన్నారు చిరంజీవి. సరైన ప్రభుత్వాలు వస్తేనే ఆశించిన అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు చిరు. జూబ్లీహిల్స్‌ BNSL సెంటర్‌లో నటుడు అల్లు అర్జున్ ఓటేశారు. అలాగే ఓబుల్ రెడ్డి స్కూల్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకుంది. సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎన్టీఆర్.. క్యూ లైన్‌లో నిలబడి ఓటేశారు.

Tags:    

Similar News