కాంగ్రెస్‌ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

* పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చిన మాణిక్కం ఠాగూర్‌

Update: 2022-12-14 05:52 GMT

కాంగ్రెస్‌ నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ వార్ రూమ్‌ను గత రాత్రి పోలీసులు సీజ్ చేసి కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిన్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్ష పార్టీలపై నిర్బంధం ప్రజస్వమ్యాన్ని ఖూనీ చేయడమే అని అన్నారు. నిరసన వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. ఇలాగే చేస్తే ప్రజలు తిరగబడుతారని మల్లు రవి హెచ్చరించారు. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్‌ హెడ్ సునీల్ కనుగోలు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసుల దాడికి నిరసనగా ఇవాళ నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్లు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

నిన్న మాదాపూర్‌ ఇనార్బిట్‌మాల్‌ సమీపంలోని కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్‌ హెడ్ సునీల్ కనుగోలు కార్యాలయంలో కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను పోలీసులు సీజ్‌ చేశారు. ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు నిరసన తెలుపనున్నారు. అలాగే ఢిల్లీలోని బీఆర్‌ఎస్ భవన్‌ను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ముట్టడించనున్నారు.

Tags:    

Similar News