సహస్రాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
Hyderabad: *13 రోజులపాటు జరగనున్న వేడుకలు *13న రామానుజాచార్యుల బంగారుమూర్తి విగ్రహావిష్కరణ
Hyderabad: రామానుజాచార్య సహస్రాబ్ధి వేడుకలకు ముచ్చింతల్ ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో నేటి నుంచి ఈనెల 14 వరకు సహస్రాబ్ధి ఉత్సవాలను నిర్వహించనున్నారు. కాసేపట్లో అంకురార్పణ, వాస్తుపూజ జరగనుంది. తొలిరోజు 108 దివ్యదేశాల ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం, స్వర్ణమూర్తి ప్రతిష్ఠామహోత్సవం, సమతామూర్తి లోకార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక రేపు అగ్ని ప్రతిష్ఠ, అష్టాక్షరి జపం, 4న పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇక 5వ తేదిన వసంత పంచమి సందర్భంగా రామానుజాచార్య మహావిగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 13న రామానుజాచార్యుల బంగారుమూర్తి విగ్రహావిష్కరణ జరుగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవిండ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 14న మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. 13 రోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.