Charla Encounter : చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్...తెలంగాణ సర్కార్‌కు భారీ షాక్
Charla Encounter : నిన్న మొన్నటి వరకు పచ్చని ప్రకృతి అందాలతో అందరినీ అలరించిన తెలంగాణలోని అడవులు గత కొద్ది రోజుల నుంచి తుపాకుల మోతతో దద్దరిల్లుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అటు మావోయిస్టులకు ఇటు పోలీసులకు మధ్య వరుసగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. గడిచిన నెలరోజుల్లోనే భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులకు, మావోలకు వరుసగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో పలువురు మావోలు పోలీసుల చేతిలో హతమయ్యారు. ఈ రెండు సంఘటనలు మరచిపోకముందే తాజాగా మరో ఎన్ కౌంటర్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన తాజాగా బుధవారం రాత్రి చర్లలో చోటుచేసుకుంది.
అయితే ముందుగా జరిగిన రెండు ఎన్ కౌంటర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి షాక్ తగలనప్పటికీ ఈ విషయంలో మాత్రంలో ఊహించని రీతిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. హైకోర్టులో ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని లంచ్ మోషన్ దాఖలు చేసారు. చనిపోయిన ముగ్గురు మావోల మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ కోర్టును కోరారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం , ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలని కోరారు. అంతే కాక ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల పై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టింది. హైకోర్టు ఈ పిటీషన్ ను మధ్యాన్నం 2.30 విచారించనున్నది.
ఇక పోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న రాత్రి పోలీసులకు, మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో 8 ఎంఎం రైఫిల్, బ్లాసింగ్‌కు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.