Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్
Pawan Kalyan reaction on Allu Arjun arrest issue: సంధ్య థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. మీడియాతో చిట్ చాట్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయినప్పుడు వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉంటే బాగుండేదన్నారు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం పుష్ప 2 టీమ్ నుండి ఎవరైనా ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని సూచించారు. అక్కడే మానవత్వం లోపించినట్లుగా కనిపించిందన్నారు. అది చేయకుండా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
పుష్ప 2 సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదనే కారణంతోనే ఆయన్ను అరెస్ట్ చేశారనడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డిది ఆ స్థాయి కాదని, ఆయన అంతకు మించిన బలమైన నేత అని చెప్పుకొచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పుష్ప 2 మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం అందుకే జరిగిందన్నారు.
గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్
గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావాల్సిందిగా ఆహ్వానించడానికి ఇవాళ ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్, దిల్ రాజు భేటీ జరిగింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతితో పాటు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
జనవరి 4న రాజమండ్రిలో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ప్రకారమే దిల్ రాజు ఈ డేట్ సెట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు.