హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. నగర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో పాటుగానే పలు కాలనీల్లో కూడా వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఈ క్రమంలో మీర్‌పేట చెరువు కూడా గండి పడినట్లు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి సీరియస్ అయ్యారు. మీర్ పేట్ చెరువుపై వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి ఆ వార్తలను ఖండించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు మీర్ పేట చెరువును పరిశీలించారు. కట్ట నుంచి నీళ్లు లీకవుతున్న ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మీర్‌పేట్–బడంగ్‌పేట్ మధ్య ఉన్న చెరువు మహేశ్వరం నియోజకవర్గంలో ఉందని, ఈ చెరువు విస్తీర్ణంలో చాలా పెద్దదని ఆమె అన్నారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు చెరువు కట్టలకు ఇటీవల గుంతలు తవ్వారని తెలిపారు. ఈ గుంతల నుంచే చెరువుకు గండీ పడి నీరు భారీగా బయటకు పోతోంద వారు స్పష్టం చేసారు. ఈ నగరంలో ఉన్న చెరువులన్నీ చిన్న పాటి వర్షానికి పొంగిపొర్లుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. శిఖం భూములు చాలా వరకు కబ్జాకావడం, ఇంటి వ్యర్ధాలను కట్టకు లోపలి వైపు పోయడంతో చెరువు విస్త్రీర్ణం చాలా వరకు కుంచించుకుపోయిందన్నారు. ఫలితంగా చెరువుకు దిగువన ఉన్న ఎంఎల్‌ఆర్‌కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్ ఎస్‌కాలనీ, న్యూ బాలాజీనగర్, జనప్రియనగర్, టీఎస్‌ఆర్‌కాలనీ, అయోధ్యనగర్‌లు ముంపు ప్రాంతాలుగా మారాయన్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఉంటున్నవారు నిత్యం ఆందోళన మధ్య నివసిస్తున్నారని స్పష్టం చేసారు. జనప్రియ నగర్‌లోని క్వార్టర్లలో 20 శాతం మంది, న్యూ బాలాజీనగర్ కాలనీలో 90 శాతం మంది ఇప్పటికే తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. ముంపు మరింతగా ఉంటుందేమో అనే భయాందోళనల మధ్య మిగిలిన కాలనీల్లోనూ చాలా వరకు నివాసాలు ఖాళీ అయ్యాయి.