Telangana Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌

Telangana Assembly: మ.12 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

Update: 2024-02-10 02:06 GMT

Telangana Assembly: ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌

Telangana Assembly: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి.. కాంగ్రెస్‌‌ తన ఫస్ట్‌ మార్క్‌ చూపే తొలి బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా తెలంగాణ బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఈ నెల 12న చర్చ జరగనుంది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో.. విద్య, వైద్యం, సాగుకు భారీగా నిధులు కేటాయించే చాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందని సర్కార్‌ వెల్లడించింది. వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన చేసింది ప్రభుత్వం. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి, పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్‌ 100 శాతం వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.

తొలి బడ్జెట్‌లోనే సీఎం రేవంత్‌ మార్క్‌ కూడా కనిపించేలా కేటాయింపులు ఉండే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 11 వందల 90 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా విద్యారంగ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు కోటి రూపాయలను కేటాయిస్తారని చెబుతున్నారు.

అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ కావడంతో ప్రభుత్వం ఆచితూచి బడ్జెట్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కార్నర్ చేస్తున్న తరుణంలో..ప్రతిపక్షానికి తమ పద్దుతో సమాధానం చెప్పేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆచరణ సాధ్యమైన హామీలకు మాత్రమే కేటాయింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఐదు వందల రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేత వంటి గ్యారంటీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్‌లో నిధులను కేటాయించినట్లు తెలిసింది. కల్యాణమస్తు పథకం కింద ఇచ్చే నగదుతో పాటు తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా చేసే ఛాన్స్ ఉంది.  

Tags:    

Similar News