Online Classes : ఆన్ లైన్ లో మోగుతున్న బడి గంట.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులు

Update: 2020-07-08 10:12 GMT

online classes : ఉదయం లేవగానే వడివడిగా బడికెళ్లాల్సిన పనిలేదు. ఏం చక్కా పిల్లలు పాఠాలు వినేస్తున్నారు. చకచక హోం వర్కులు చేసేస్తున్నారు. బడి గంట మోగకున్నా హాయ్ గా సెలబస్ నేర్చుకుంటున్నారు. కరోనా రక్కసి విద్యార్థుల చదువులకు బ్రేక్ వేసింది. అయ్యే పిల్లల చదువుల సంగతీ ఎలా అని తల్లిదండ్రులు బాధపడ్డారు. కానీ ఆ సమస్యను పటాపంచలు చేశాయి ఆన్ లైన్ క్లాస్ లు. ఇళ్లు కదలకుండానే అరచేతిలోకి అన్ని క్లాస్ లు వచ్చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సర్కార్ బడిలో కూడా వినూత్న బోధనకు అడుగులు పడుతున్నాయి.

కరోనా దెబ్బకు విద్యాసంస్థలకు తాళాలు పడ్డాయి. అకడామిక్ ఇయర్ ప్రారంభమైనా బడి గంట మోగడం లేదు. అసలు ఈ విద్యాసంవత్సరం ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు పుట్టకచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పాఠశాల యజమాన్యాలు తలలు పట్టుకున్నాయి. అప్పుడే ఆన్ లైన్ క్లాస్ లు విద్యార్థుల పాలిట వరంగా మారాయి. ప్రైవేట్ పాఠశాలలోనే కాదు సర్కారు బడుల్లోనూ ఇది సాధ్యమవుతుందని ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కూర గ్రామ పాఠశాల నిరూపించింది. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు అందిస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలోని కూర గ్రామ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆన్ లైన్ క్లాసుల బోధనలో విజయం సాధిస్తున్నారు. జూమ్ యాప్ ద్వారా సులభంగా విద్యాబోధన చేస్తున్నారు. ఇటు విద్యార్థులు సైతం ఇంటివద్దనే ఉండి చక్కగా ఆన్ లైన్ పాఠాలు వింటున్నారు. తరగతి గదిలో ఎలా అయితే శ్రద్ధగా విన్నామో. ఇప్పుడు కూడా మొబైల్ లో క్లాసులు వింటున్నామని విద్యార్థులు చెబుతున్నారు.

ఆన్ లైన్ బోధన పూర్తైనా తర్వాత విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కూడా ఉపాధ్యాయులు అవకాశం కల్పిస్తున్నారు. పాఠాలు బోధించిన తర్వాత. మరుసటి రోజు విద్యార్థులకు హోమ్ వర్క్ కూడా అలాట్ చేస్తున్నారు. ఇలా కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. మిగిలిన విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కూర గ్రామ ప్రభుత్వ పాఠశాల విధానాలను అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆదర్శంగా విద్యార్థుల భవిష్యత్ కు బంగారు బాటలు వేయాలని కోరుతున్నారు.

Full View



Tags:    

Similar News