తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఉన్న ఇళ్లు మాత్రమే కాకుండా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. అయితే కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ధరని పోర్టల్ ప్రారంభించిన తరువాత వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో, వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనుసందానం చేయనుంది.
ఇక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఆస్తుల నమోదు ప్రక్రియలో 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో ఈ ఆస్తుల వివరాలన్నింటినీ పొందుపరిచింది. అయితే ఆస్తుల నమోదుకు ముందు 53.23 లక్షల కట్టడాలున్నట్లు రివిజన్ రిజిష్టర్‌లో లెక్క తేలగా, ఇటీవలె లెక్కించిన ఆస్తుల కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది.
ఇక పోతే పంచాయతీ కార్యదర్శులు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్ చేయడంలో భాగంగా గ్రామాల్లోనే ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ న్యాప్ (నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్)లో ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సర్వే చేస్తున్న కార్యదర్శులకు ఒక్కో గ్రామంలో ఇంటర్నెట్ సమస్య తలెత్తడం, ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం పెద్ద సవాల్‌గా మారింది. దీంతో రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఇక ఈ నమోదు ప్రక్రియలో కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి చేయడం కూడా పెద్ద సమస్యగా తయారైంది. ఇన్ని సమస్యలు ఉన్పప్పటికీ 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని సోమవారం నాటికి యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు తెలిపారు.