Nizamabad in Grip of Seasonal Diseases: కరోనాకు తోడైన సీజనల్ వ్యాధులు

Update: 2020-07-29 08:11 GMT

Nizamabad in grip of Seasonal diseases: ఓ వైపు కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న వేళ మరో కొత్త సమస్య వెంటాడుతోంది. కరోనాకు తోడు సీజనల్ వ్యాధులు కూడా మానవాళిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్ మోగిస్తుంటే విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సీజనల్ వ్యాధుల ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ తో జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే తాజాగా డెంగీ, చికన్ గున్యా, మలేరియా, టైపాయిడ్ బారిన పడి జనం మంచం పడుతున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 23 డెంగీ కేసులు నమోదు కాగా ఓ చికన్ గున్యా కేసు కూడా నమోదైంది. ఇక మలేరియా, టైఫాయిడ్ లాంటి ఫీవర్స్ వస్తుండటంతో జనం హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు.

గత సీజన్ లో రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ లోనే డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దాదాపు 6 వందల మంది డెంగీ బారిన పడ్డారు. ఈ సీజన్ లో మళ్లీ డెంగ్యూ జ్వరాలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాన్స్ మిషన్ సీజన్ ప్రారంభం అయ్యిందని రాబోయే రోజుల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని జిల్లా మలేరియా అధికారి చెబుతున్నారు.

సాధారణ దగ్గు, జలుబు వస్తే చాలు జనం కరోనా వచ్చిందని వణికిపోతున్నారు. ఏది సీజనల్ వ్యాధో ఏది కరోనానో తెలియక టెన్షన్ పడుతున్నారు. అయితే ఈ రెండింటిలో దగ్గు లక్షణాలు ఒకేలా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. అడపా దడపా టైఫాయిడ్ తో పాటు ఇతర కేసులు నమోదవుతున్నాయని, కరోనా కేసులతో పాటు నాన్ కరోనా వ్యాధులపై సిబ్బందిని అప్రమత్తం చేశామని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు డీఎంహెచ్ఓ. అయితే ఇప్పటికే జిల్లాలో 15 వందలకు పైగా కరోనా కేసులు నమోదవటం వీటికి తోడు డెంగీ మళ్లీ వణుకు పుట్టిస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News