నితీశ్ కుమార్ ప్రధాని రేసులో లేరన్న JDU
Nitish Kumar: మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయడమే లక్ష్యమని వెల్లడి...
Nitish Kumar: రాబోయే ఎన్నికల్లో బిహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్షాల ప్రధాని అభ్యర్థి అంటూ వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఇటీవల నితీశ్ కుమార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అనంతరం బీజేయేతర ప్రధాని అభ్యర్థి ఎవరన్నదానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో విపక్షాల ప్రధాని అభ్యర్థి మీరేనా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నితీశ్ కుమార్ పొడిపొడిగా సమాధానమిచ్చారు. నితీశ్ కుమార్ ప్రధాని రేసులో లేరని, ప్రతిపక్షాలను ఏకం చేయడమే ఆయన లక్ష్యమని స్పష్టం చేశారు జేడీయూ చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని రాజీవ్ రంజన్ తేల్చిచెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోడీపై పోటీగా తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలనేది ప్రతిపక్షాలన్నీ కలిసి కూర్చుని నిర్ణయిస్తాయని సింగ్ వివరించారు. నితీశ్ చుట్టూ వార్తలను ఊహాజనితమని ఆయన కొట్టిపారేశారు.