NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: నిజామాబాద్‌, నిర్మల్‌, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో తనిఖీలు

Update: 2022-09-18 06:12 GMT

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు

NIA Raids: పీపుల్స్‌ ఫ్రంట్‌ ఇండియా కేసులో దర్యాప్తును NIA వేగవంతం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిజామాబాద్‌, నిర్మల్‌, కడప, నెల్లూరు జిల్లాల్లో NIA అధికారుల బృందం ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో PFI కేసులో అరెస్టయినవారి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. తెల్లవారుజాము నుంచి హౌసింగ్‌బోర్డు కాలనీతో పాటు.. నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. అటు.. నిర్మల్‌ జిల్లాలోనూ NIA సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భైంసా పట్టణంలోని మదీనాకాలనీలో పలు ఇళ్లలో NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్‌లో సోదాల తర్వాత అక్కడ లభించిన సమాచారంతో.. భైంసాలో సోదాలు నిర్వహించారు. ఆగస్టు 28న నిజామాబాద్‌లో PFI కేసు నమోదు కావడంతో.. వారితో సంబంధమున్న వారి ఇళ్లల్లో NIA అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఇక ఏపీలోనూ NIA సోదాలు కొనసాగుతున్నాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 23 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు సాగిస్తున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. తరచుగా బేస్‌క్యాంపులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు. కరాటే, లీగల్‌ అవేర్‌నెస్‌ ముసుగులో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు NIA అధికారులు సమాచారం రాబట్టారు.

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఖాజానగర్‌లో NIA అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇలియాజ్‌తో పాటు అతని మిత్రుల ఇళ్లల్లో సోదాలు జరుపుతున్నారు. అయితే.. NIA అధికారుల తీరును కొందరు తప్పుబట్టారు. అధికారుల వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో బుచ్చిరెడ్డిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

అటు కర్నూలు జిల్లా నంద్యాలలోనూ NIA దాడులు కొనసాగుతున్నాయి. 

Tags:    

Similar News