సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఫామ్‌హౌస్ కేసు నిందితులు
* ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నిందితులు
Farm house Case Episode: మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అరెస్ట్ చేసేందుకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లారు. పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం ముందు నిందితుల తరఫు న్యాయవాదులు ప్రస్తావించగా.. శుక్రవారం చేపట్టే కేసుల విచారణ జాబితాలో దీన్ని చేర్చాలని ధర్మాసనం ఆదేశించింది. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన విషయం సంచలనం సృష్టించింది.
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులు ప్రలోభ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసిశారు. అయితే నిందితుల రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం నిందితుల అరెస్ట్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై నిందితులు ముగ్గురూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.