సీకేఎం ఆసుపత్రిలో లాప్రొస్కోపి యంత్రం మాయం..స్టోరీలో కొత్త మలుపు
Warangal: రెండేళ్లుగా కనిపించని రూ.14 లక్షలు విలువ చేసే మిషనరీ
Warangal: వరంగల్ సికెఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో లాప్రొస్కొపీ యంత్రం మాయమైన విషయాన్ని హెచ్ఎంటీవీ ఈనెల 16 న తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత విచారణ వేగవంతమైన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ మాయమైన యంత్రం మరో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు తేలిందట. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఆ యంత్రాన్ని ఇక్కడకు తెప్పించి దోషులను రక్షించే ప్రయత్నాలు మొదలయ్యాయి.
వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన లాప్రొస్కొపీ యంత్రం అంశం కొత్త మలుపులు తిరుగుతూ హైదరాబాద్‌కు చేరింది. స్త్రీల చికిత్సలో అత్యవసరమైన ఈ యంత్రం 2020 ఆగస్టులో థియేటర్ ఇన్‌ఛార్జిగా ఉన్న హెడ్ నర్సు సెలవులో ఉన్న సమయంలో మాయం చేశారు. ఆమె విధుల్లో చేరాక రాతపూర్వకంగా దీనిపై సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల కుమారికి ఫిర్యాదు చేశారు. ఆమె డాక్టర్ శ్యాంకుమార్‌ను విచారణకు అదేశించారు. ఈ వ్యవహారంపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రమేష్‌రెడ్డి ఆరా తీశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డాక్టర్ నిర్మలా కుమారిని ఆయన ఆదేశించినట్లు తెలిసింది.
అయితే ఈ విషయంలో ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించారు. ఇదే ఎక్విప్ మెంట్ వరంగల్ సీకేఎంతో పాటు హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రి కోసం కొనేందుకు రెండు చోట్ల డబ్బులు డ్రా చేసి ఒకే యంత్రాన్ని కొనుగోలు చేసారు. తొలుత ఎక్విప్ మెంట్ ను సీకేఎంలో ఇన్ స్టాల్ చేసి తర్వాత అదే యంత్రాన్ని మాయ చేసి కింగ్ కోటి ఆస్పత్రికి తరలించారు. తెలివిగా కింగ్ కోటి ఆసుపత్రిలో ఇదే ఎక్విప్ మెంట్ కొనుగోలు చేసినట్లు కొత్త రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. పోలీసు విచారణలో ఈ నిజాలు వెలుగు చూస్తాయన్న భయంతో, మాయగాళ్లు యంత్రం హైదరాబాద్ కోటి సెంటర్‌లోని ఓ కంపెనీలో మరమ్మతు అవుతోందన్న కొత్త కథను తెరమీదికి తెచ్చినట్లు తెలిసింది. డీఎంఈ పోలీసు విచారణకు ఆదేశించమన్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసు ఫిర్యాదు చేయకుండా జాప్యం చేయడం మరింత అనుమానాలకు దారితీస్తోంది.
ఈ వ్యవహారంలో ఓ తాజా మాజీ కార్పొరేటర్, ఎమ్మెల్యే కూడా ఎంటరై ఇంటిదొంగను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక హాస్పిటల్ లో మాయమైన యంత్రం మరో హాస్పిటల్ లో ప్రత్యక్షమవడం... అలాగే, రెండు చోట్ల డబ్బులు డ్రా చేసిన అప్పటి అధికారులు ప్రస్తుతం దొరకని దొంగల్లా చోద్యం చూస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.