కరోనా కొత్త స్ట్రెయిన్‌ తెలంగాణలో ఒకరిలో!

Update: 2020-12-29 04:38 GMT

కరోనా కొత్త స్ట్రెయిన్‌ తెలంగాణలో ఒకరిలో నిర్ధారణ అయింది. ఇటీవల ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన వ్యక్తి లో దీనిని గుర్తించారు. ఆ వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్టు అయినవారిలో తల్లి, భార్య, డ్రైవర్‌ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా తల్లికి పాజిటివ్‌ అని తేలింది. ఆమెకు సోకింది కొత్త కరోనానా? కాదా? అని తేల్చేందుకు నమూనాలను సీసీఎంబీకి పంపారు.

యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారి నమూనాల జన్యు విశ్లేషణ అనంతరం ఫలితాల నివేదికను ఆదివారమే సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అందులోనే వరంగల్‌ వ్యక్తిలో కొత్త స్ట్రెయిన్‌ను నిర్ధారించినట్లు సమాచారం. ఇతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కొద్ది రోజుల్లోనే డిశ్చార్జి అవుతారని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొత్త స్ట్రైయిన్‌ కేసుల వివరాలను మాత్రం కేంద్రమే ప్రకటిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో సోమవారం మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన ఇతడికి ఇంటి వద్ద పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలింది.

 యూకే మీదుగా డిసెంబరు 9 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రానికి 1,216 మంది వచ్చారు. ఇందులో 1,060 మందిని గుర్తించారు. రాష్ట్రంలో ట్రేస్‌ అయినవారిలో 996 మందికి పరీక్షలు నిర్వహించగా, 966 మందికి నెగెటివ్‌ వచ్చింది. 9 మంది ఫలితాలు రావాల్సి ఉంది. 21 మందిలో పాజిటివ్ తేలిది. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో కరోనా కొత్త స్ట్రైయిన్‌ కేసు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం బీఆర్కే భవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కొత్త రకం వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందా? కేంద్రం ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తుందో పరిశీలించి వాటిప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు.a

Tags:    

Similar News