ఘనంగా ప్రారంభమైన...ఆదివాసీల అతిపెద్ద జాతర

Update: 2021-02-12 07:15 GMT

Nagoba festival (file Image)

ఆదివాసీల అతిపెద్ద జాతరకు తెరలేచింది. కేస్లాపూర్ లో తొలిఘట్టం ఆవిష్కృతమైంది. గిరివనం జనారణ్యమైంది. దారులన్నీ అటువైపే సాగాయి. గోదావరి జలాలతో ఆదిశేషునికి అభిషేకంతో నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది.

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ఒకటైన ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లోని నాగోబా జాతర ఉత్సవాలు గురువారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. జిన్నారం మండలం హస్తిన మడుగు నుంచి తీసుకువచ్చిన గోదావరి పవిత్ర జలాలతో నాగోబాకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు మెస్రం వంశీయులు చేయడంతో నాగోబా జాతర ప్రారంభమైంది.

అంతకుముందు నాగోబా ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులోని జలాన్ని కొత్త మట్టికుండల్లో గర్భగుడి వరకు తీసుకువచ్చారు. మెస్రం వంశానికి చెందిన ఆడపడుచులు... ఆ నీటితో ఆలయంలోని విగ్రహాలను శుద్దిచేశారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టమట్టితో బౌల దేవతల విగ్రహాలను తయారు చేసి ప్రత్యేక పూజలు జరిపారు.

నాగోబా జాతర ప్రారంభ వేడుకల్లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గురువారం నుంచి ఐదు రోజులపాటు జరిగే నాగోబా జాతరకు తెలంగాణతో పాటు చుట్టుపక్కలగల ఆరు రాష్ట్రాల నుంచి గిరిజనులు తరలివస్తున్నారు. అశేష భక్తజనంతో కేస్లాపూర్ చెట్టూ పుట్టా జనారణ్యాన్ని తలిపిస్తోంది.

Tags:    

Similar News