కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌పై ఎంపీడీవోల తిరుగుబాటు వెనక అసలు కథేంటి?

Update: 2020-07-03 11:46 GMT

కుమ్రం బీమ్ జిల్లాలో కలెక్టర్‌పై ఎంపీడీవోల తిరుగుబాటు వెనక అసలు కథేంటి? కలెక్టర్‌పై ఈస్థాయిలో ఎర్రజెండా ఎగరెయ్యడానికి కారణమేంటి? ఎంపీడీవోల వెనక కొందరు రాజకీయ నాయకులున్నారన్న ప్రచారంలో నిజమెంత? కలెక్టర్‌పై కత్తులు నూరడానికి బీజం ఎక్కడ పడింది? ఎందుకంతగా వారి మధ్య యుద్ధం రాజుకుంటోంది?

కుమ్రం బీమ్ జిల్లాలో కలెక్టర్ వర్సెస్ ఎంపిడిఓల పోరు ఆసక్తికరంగా మారింది. జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మీ అధ్యక్షతన ఎంపిడిఓలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో శ్మశాన వాటికల పనులు, ఉపాధి పనులపై అధికారులతో చైర్‌ పర్సన్ కోవాలక్ష్మి, జడ్పీ సీఈఓ వేణు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇదే మీటింగ్ కలెక్టర్, ఎంపిడిఓల మధ్య విభేదాలు పెంచడానికి కారణమైంది. తాజాగా మళ్లీ కలెక్టర్ ఎంపిడిఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనకు తెలియకుండా జడ్పీ చైర్ పర్సన్‌తో రివ్యూ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని జడ్పీ సీఈఓ వేణుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసింది.

జడ్పీ సీఈఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఎండిఓలు మనస్తాపానికి గురయ్యారు. తమ ముందే ఆయనపై, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఎంపిడిఓలు తప్పుపడుతున్నారు. కావాలనే కలెక్టర్ ఎంపిడిఓలను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ తీరును నిరశిస్తూ ఎంపిడిఓలు ఏకంగా సామూహిక సెలవుపై వెళ్తున్నామని, జడ్పీ చైర్ పర్సన్ కోవాలక్ష్మీకి, వినతి పత్రం ఇచ్చారు. చెప్పినట్టే విధులకు దూరంగా వుండిపోయారు.

అయితే కరోనా సమయంలో ఎంపిడిఓలు సామూహిక సెలవు అస్త్రాన్ని సందించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఎంపీడీవోల నిరసన వెనకున్న అసలైన కారణాలపై కూడా బోలెడంత చర్చ జరుగుతోంది. కావాలనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝూను అభాసుపాలు చేయడానికి కుట్ర జరుగుతోందన్న ఆరోపణలొస్తున్నాయి. కరోనా సమయంలో కలెక్టర్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రజల్లో పేరుంది. లాక్‌డౌన్‌ను సైతం పకడ్బందీగా అమలు చేశారు. దాంతో కరోనాను కలెక్టర్ కట్డడి చేశాన్న చర్చ జరుగుతోంది. అభివృద్ది విషయంలో తనదైన ముద్రవేస్తున్నారు. అయితే పైరవీలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఇదే కొందరు నేతలకు, ఎంపీడీవోలకు గిట్టడం లేదన్న విమర్శలున్నాయి.

అయితే కలెక్టర్ పాలన, సమర్థత కొందరు అధికారులకు, ప్రజాప్రతినిదులకు కంటగింపు మారిందన్న విమర్శులున్నాయి. అందుకే జడ్పీ సీఈఓ అంశాన్ని పట్టుకుని, ఎంపిడిఓలను కొందరు రాజకీయ నేతలు ఉసిగొల్పుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అసిఫాబాద్ ఎంపిడిఓ రిటైర్ మెంట్ కు మూడు నెలల సమయం ఉంది. రిటైర్ మెంట్ దగ్గపడినా, సదరు ఎంపిడిఓను సీఈఓ మరొక మండలానికి బదిలీ చేయించారు. దీనిపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. కలెక్టర్ సైతం ఈ బదిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇలా రకరకాల ఘటనల నేపథ్యంలో, కలెక్టర్‌‌పై తిరుగుబాటు చేశారు ఎంపీడీవోలు. కలెక్టర్‌ను బదిలి చెయ్యాలని కేటీఆర్‌ను సైతం కలవాలని డిసైడయ్యారట.

మొత్తానికి కలెక్టర్‌పై ఎంపీడీవోలు ఎర్రజెండా ఎగురవెయ్యడం వెనక ఇంత కథ వుంది. పైరవీలకు అడ్డుపడటం, కఠినంగా వున్నందుకే, కొందరు స్థానిక రాజకీయ నేతలు కలెక్టర్‌పై ఎంపీడీవోలను ఉసిగొల్పారన్న ఆరోపణలున్నాయి. చివరికి వీరి తిరుగుబాటు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


Full View


Tags:    

Similar News