నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకుంటా.. సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ సవాల్

పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని కేసీఆర్ సవాల్ చేశారు. అయితే సీఎం కేసీఆర్‌ సవాల్‌పై ఎంపీ బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Update: 2020-10-31 13:10 GMT

తెలంగాణలో పెన్షన్ల విషయంలో టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పెన్షన్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు అస‌త్య ప్రచారాలు చేస్తున్నారన్న కేసీఆర్.. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని రుజువు చేస్తే సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని కేసీఆర్ సవాల్ చేశారు. అయితే సీఎం కేసీఆర్‌ సవాల్‌పై ఎంపీ బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాలేదంటూ ఝూటా మాటలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదలపై చర్చకు రావాలంటూ ప్రతి సవాల్‌ విసిరారు. ఒకవేళ నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

అంతకుముందు బీజేపీ నాయ‌కుల‌పై తెలంగాణ కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు చేస్తున్న అస‌త్య ప్రచారాలను సీఎం ఎండ గట్టారు. బీజేపీ నాయ‌కులు ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డ‌బ్బులు చెల్లిస్తుంద‌ని చెబుతున్నారు. ఒక వేళ దాన్ని రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని కేసీఆర్ సవాల్ చేశారు.

రాష్ట్రంలో పింఛనులలో రూ.1600లు కేంద్రమే ఇస్తున్నట్టు బీజేపీ నేతలు ప్రచారం చేయడం పట్ల సీఎం మండిపడ్డారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామని అన్న కేసీఆర్ కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఇక ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల కోసం రూ.11వేలకోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం కేవలం రూ.105 కోట్లు మాత్రమే ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే ఘనవిజయం అని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. శనివారం జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదిక ప్రారంభించిన సందర్భంగా ఈ వాఖ్యలు చేశారు కేసీఆర్..

Tags:    

Similar News