సమరానికి సిద్ధం.. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి.

Update: 2022-09-06 01:29 GMT

సమరానికి సిద్ధం.. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు మొదలవుతాయి. అసెంబ్లీ తొలిరోజు దివంగత ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానాల అనంతరం ఉభయసభలు ఈనెల 13కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 6, 13, 14 తేదీల్లో అసెంబ్లీని నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక సభలో ప్రభుత్వాన్నీ నిలదీయాలని ప్రతిపక్షాలు డిసైడ్ అయ్యాయి. దీంతో సెషన్స్ వాడీవేడీగా జరిగే అవకాశం ఉంది. కొంత కాలంగా కేంద్రం, తెలంగాణ సర్కార్ మధ్య వార్ సాగుతోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీరుకు నిరసనగా అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రచారం చేయడంతో పాటు రాష్ట్రాన్ని కేంద్రం ఇబ్బంది పెడుతున్న తీరును సభా వేదికగా ఎండగట్టాలని టీఎర్ఎస్ భావిస్తోంది. దీంతో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌తో పాటు ప్రతి షార్ట్ డిస్కషన్‌లో కేంద్రాన్ని నిలదీయాలని అధికార పార్టీ నిర్ణయించింది.

ఎఫ్ఆర్బీఎం పేరుతో కేంద్ర సర్కార్ ఆర్థిక ఆంక్షలు, విద్యుత్ బకాయిల విషయంలో ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయం, ఉచిత పథకాలు వంటి అంశాలపై తీర్మానాలు కేంద్రానికి పంపనున్నారని సమాచారం. గోదావరి వరదలు, సాయం పట్ల కేంద్రం మీద అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రకటన చేయవచ్చని అంటున్నారు. విభజన చట్టంలో ఉన్నా వెనకబడిన జిల్లాలకు మూడేళ్లుగా ఆర్థికసాయం చేయకపోవడంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తున్న కేసీఆర్ రాష్ట్రంలోకి సీబీఐ సాధారణ అనుమతుల రద్దుపై అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేయవచ్చని తెలుస్తోంది. సెప్టెంబరు 17 సందర్భంగా నిర్వహించనున్న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలపైన సీఎం ప్రకటన చేస్తారని అంటున్నారు పార్టీ వర్గాలు. ఈసారి అసెంబ్లీలో గతానికి భిన్నంగా కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.

రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈసారి అసెంబ్లీలో బీజేపీ శాసనసక్షపక్ష నేతగా ఎవరు ఉంటారనే ఆసక్తి పెరిగింది. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజాసింగ్ గెలిచారు. తర్వాత దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలిచారు. అసెంబ్లీలో బీజేపీ బలం రెండుకు పెరగగా ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ గా రాజాసింగ్ వ్యవహరించారు. గత ఏడాది జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలవడంతో అసెంబ్లీలో బీజేపీ బలం మూడుకు పెరిగింది. ట్రిపుల్ ఆర్‌లు వచ్చాకా కూడా రాజాసింగే బీజేఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. దీంతో రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. వీడియో వివాదం తర్వాత రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ పెట్టడంతో ప్రస్తుతం ఆయన జైల్‌లో ఉన్నారు. దీంతో మంగళవారం నుంచి జరగనున్న అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎవరు ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఇక రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ ఈసారి ఐదుగురు ఎమ్మేల్యే లతో సభకు హాజరుకానుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెబుతోంది.

మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ప్రచార వేదికగా ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు సభ వాయిదా వేసిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. అందులో శాసనసభ పనిదినాలు, చర్చించే అంశాల పై నిర్ణయం తీసుకుంటారు.

Tags:    

Similar News