జవాను మోతీలాల్‌ మృతిపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి

Update: 2021-01-15 12:19 GMT

సెలవులకు స్వగ్రామానికి వచ్చిన ఓ ఆర్మీ జవాను రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 20 రోజులు మృత్యువుతో పోరాడి మరణించాడు. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మెగ్యా నాయక్ తండాకు చెందిన భారత ఆర్మీ జవాన్ మోతిలాల్ గత నెల డిసెంబర్ 20న సెలవులపై స్వగ్రామానికి వచ్చాడు. డిసెంబర్ 30తో సెలవులు పూర్తి కానుండటంతో 29న స్నేహితుడిని కలిసేందుకు తన ద్విచక్రవాహనంపై కామారెడ్డి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సదాశివనగర్ మండలం వద్ద 44వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాదులోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కోమాలో ఉన్న మోతిలాల్‌ను అక్కడి నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించి కొన్ని గంటల క్రితం మరణించాడు. ఆర్మీ జవాన్ మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతి చెందిన జవాన్ మోతిలాల్ 2016లో ఆర్మీలో విధుల్లో చేరాడు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నాడు. విధి వక్రీకరించడంతో మరణించాడు. ఈ మరణ వార్తను విన్నమాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ.. దేశ రక్షణకై సైన్యంలో చేరిన మోతీలాల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంపై దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. మోతీలాల్‌ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. మోతీలాల్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. 


Tags:    

Similar News