TSRTC: టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి బాధ్యతలు
TSRTC: బస్‌భవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరణ
TSRTC: గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న టీఎస్ ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సంచలనాల ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. అయితే.. అతి కొద్దిరోజుల్లోనే ఆర్టీసీ ఛైర్మన్‌గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తెలంగాణ సర్కార్ నియమించింది. ఆర్టీసీ కథ ముగిసినట్టేనని కామెంట్స్ చేసినవారి నోర్లను మూయించింది. ఇప్పటికే ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. పలు అంశాలపై దృష్టి సారించి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో కొత్త ఛైర్మన్ నియామకంతో ఆర్టీసీ మళ్లీ మూమూలు స్థితికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ నూతన ఛైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బస్‌భవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవితతో పాటు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి బస్ భవన్‌కు వచ్చి బాజిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. విపత్కర పరిస్థితుల్లో సజ్జనార్‌తో పాటు తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ బాధ్యత అప్పగించారని, అధికారులతో కలిసి మళ్లీ నార్మల్ స్థితికి వచ్చేలా కృషి చేస్తామన్నారు. కరోనా కారణంగా రోజుకు 13 కోట్లు ఉన్న ఆదాయం.. 10 కోట్లకు పడిపోయిందన్నారు. త్వరలోనే సంస్థ ఆదాయాన్ని రోజుకు 14 కోట్లకు పెంచుతామని ధీమా వ్యక్తం చేశారు బాజిరెడ్డి. కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు.