Earthquake : హైదరాబాద్ నగర వాసులను ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతుంటే తాజాగా భూపంకం కూడా భయాందోళనలకు గురిచేసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఒక్క సారిగా భూమి కంపించడంతో నగర వాసులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి సుమారుగా పది గంటలు దాటిన తరువాత బస్తీల్లోని ప్రజలు అప్పుడప్పుడే భోజనం చేసి నిద్రపోవడానికి సిద్దమయ్యారు. సరిగ్గా అదే సమయానికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఏవో శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాల తాకిడికి ప్రజలంతా బాంబులు పేలాయా, లేక ఇళ్లు కూలాయో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అలా కొద్ది సేపటికి కొంత మంది భూకంపం వచ్చిందంటూ కేకలు వేయడంతో పిల్లా, పెద్దా, ముసలి, ముతకా ప్రతిఒక్కరూ ఒక్కసారిగా ఇళ్ళ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన నగరంలోని బోరబండ డివిజన్ పరిధిలోని ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్–3లో చోటు చేసుకుంది.
ఈ సంఘటనకు సంబధించి పూర్తివివరాల్లోకెళితే బోరబండ డివిజన్ పరిధిలోని సైట్–3 వీకర్‌సెక్షన్‌లోని సాయిరామ్‌నగర్, ఆదిత్యానగర్‌లలో భూకంపం వచ్చింది. ఆ ప్రాంతంలో వచ్చిన భూకంప తరంగాలు భవానీనగర్, అన్నానగర్, పెద్దమ్మనగర్, జయవంత్‌నగర్, రహమత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్‌హిల్స్ ఇతక ప్రాంతాల వరకు చేరుకున్నాయి. అయితే క్షణాల్లోనే అంతా సర్దుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక ఈ విషయంపై ఎన్‌జీఆర్‌ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనగేశ్ మాట్లాడుతూ రిక్టర్ స్కేల్‌పై 1.5 గా మాత్రమే నమోదైందని తెలిపారు. సరిగ్గా మూడేళ్ళ కిందట ఇలాంటి భూకంపం వచ్చిందని, ఇది ప్రమాదకరం కాదని స్పష్టం చేసారు.