భగ్గుమన్న గంగపుత్రలు.. క్షమాపణలు చెప్పేందుకు..

*మంత్రి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపణలు *వ్యాఖ‌్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ *క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని హెచ్చరిక

Update: 2021-01-19 16:04 GMT

తలసాని శ్రీనివాస్ ఫైల్ ఫోటో 

అనుకోకుండా మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఓ శంకుస్థాపన కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో దొర్లిన పదాలు గంగపుత్రులకు ఆగ్రహం తెప్పించాయి. గంగపుత్రులంతా మంత్రిపై ఓరేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై ఓ మెట్టు దిగిన మంత్రి.. క్షమాపణలకు సిద్ధమయ్యారు.

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల హక్కులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తెలంగాణ గంగపుత్రులంతా మండిపడుతున్నారు. మంత్రి కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. తన వ్యాఖ‌్యలను మంత్రి ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. క్షమాపణ చెప్పకపోతే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని గంగపుత్ర సంఘాల నేతలు హెచ్చరించారు.

40 కుల సంఘాలకు కోకాపేటలో భవనాలకు స్థలాలు ఇచ్చామన్న మంత్రి తలసాని రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సామాజిక వర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సభ్యత్వ అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణలో చెరువుల్లో పెరిగిన చేపలపై పూర్తి హక్కులను ప్రభుత్వం ఇచ్చిందని ఏమైనా ఇబ్బందులొస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో ఒక్కసారిగా గంగపుత్రులు మంత్రిపై విరుచుకుపడ్డారు. ఉద్యమం లేవనెత్తారు.

ఇక గంగపుత్రులంతా ఫైర్ అవుతుండటంతో దిగొచ్చారు మంత్రి తలసాని. తాను గంగపుత్రలను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తాను చేసిన కామెంట్స్ తప్పుగా ఉన్నాయని భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మొత్తానికి గంగపుత్రుల ఆరోపణలతో వివాదానికి ముగింపు పలికేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు. మరి ఇకనైనా ఈ వ్యవహారం సద్దుమణిగినుతుందా లేదా చూడాలి మరి.


Tags:    

Similar News