వ‌ర‌ద‌ల వ‌ల్ల కూలిన ఇండ్ల గ‌ణ‌న‌ను వెంట‌నే పూర్తిచేయా‌లి: మంత్రి కేటీఆర్

Update: 2020-10-17 13:11 GMT

రెండు మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు నగరమంతా సముద్రాన్ని తలపించింది. నగరంలోని పలు కాలనీలన్నీ వరద నీటితో నిండిపోయాయి. మరోవైపు డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. ఇలాంటి సమయంలోనే ప్రజలకు అండగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర‌ పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ నేడు ప్ర‌త్యేక స‌మీక్షా స‌మావేశాన్ని ఉన్నతాధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ‌ర‌ద ప్ర‌భావిత కాల‌నీల్లోని ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిస్థితులను నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల్సిందిగా ఆరోగ్య‌, మున్సిప‌ల్ అడ్మినిస్ర్టేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల కూలిన ఇండ్ల గ‌ణ‌న‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఇటువంటి వరద సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి త‌గిన‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా కోరారు. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో చేప‌ట్టిన రేష‌న్ కిట్లు, దుప్ప‌ట్ల పంపిణీని స‌మీక్షించారు. ఎక్క‌డైతే అవ‌సరం ఉంటుందో అక్క‌డ అద‌న‌పు ప‌రిక‌రాల‌ను, యంత్రాల‌ను, సిబ్బందిని తాత్కాలికంగా నియ‌మించుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ సమావేశంలో పుర‌పాల‌క‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అర‌వింద్ కుమార్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ స్వేతా మ‌హంతి, ఈవీడీఎం డైరెక్ట‌ర్ విశ్వ‌జిత్ కంప‌తి, రాష్ర్ట ప్రజారోగ్య‌, కుటుంబ సంక్షేమ డైరెక్ట‌ర్ డీఆర్‌జీఎస్ రావు, అగ్నిమాప‌క అధికారులు, హెచ్ఎండ‌బ్ల్యూఎస్ఎస్‌బీ విభాగ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News