మీడియా సంస్థ‌లు నేను అన‌ని మాట‌ల‌ను ఆపాదించాయి : కేటీఆర్

Update: 2020-09-30 10:29 GMT

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 11వ తేదీ త‌ర్వాత ఉంటాయ‌ని తాను వ్యాఖ్యానించ లేదని, కానీ కొన్ని మీడియా సంస్థలు రిపోర్టు చేయ‌డంలో నిజం లేద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. నిన్న జరిగిన సమావేశంలో న‌వంబ‌ర్ రెండో వారం త‌ర్వాత జీహెచ్ఎంసీ యాక్ట్ ప్ర‌కారం ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని, ఎన్నికల కోసం ప్రతి ఒక్క పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాల‌ని మాత్ర‌మే తాను అన్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. స‌ద‌రు మీడియా సంస్థ‌లు తాను అన‌ని మాట‌ల‌ను ఆపాదించారని, అది సరైన పద్దతి కాదని ఆయన అన్నారు. ఎన్నికలను నిర్వహించడం, ఎన్నిక‌ల షెడ్యూల్‌ పూర్తిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలో ఉండే అంశ‌మ‌ని ఆయన స్పష్టం చేసారు.

నిన్న జరిగిన సమావేవంలో మంత్రి కేటీఆర్ మాట్లాడిన మాటల విషయానికొస్తే హైదరాబాద్‌ నగరాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నామని ఆయన అన్నారు. అభివృద్ది చేయడానికే గత ఐదేండ్లలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 67వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిబంధనల ప్రకారం నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా రావొచ్చన్నారు. ఇప్పటి నుంచే ప్రతి ఒక్క నాయకుడు సన్నద్ధమవ్వాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ 91 సీట్లు కచ్చితంగా వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా ఉన్నాయన్నారు. జనంతో మమేకమై వారితో కలిసి పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు మారాలి. పరిశ్రమల పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించామని తెలిపారు. దీంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయన్నారు. ధరణి పోర్టల్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిద్దామన్నారు. ఈ విధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు హితవు పలికారు.

Tags:    

Similar News