జీహెచ్ఎంసీ ఎన్నికలపై మంత్రి హరీష్ రావు ఫోకస్.. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేందుకు వ్యూహాలు
దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బదులు తీర్చుకునేందుకు మంత్రి హరీష్ వేచి చూస్తున్నారా..? సంగారెడ్డి జిల్లా పరిథిలోని మూడు జీహెచ్ఎంసీ వార్డుల్లో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేందుకు సిద్ధపడుతున్నారా..? దుబ్బాక ఓటమి కసితో ఉన్న హరీష్ రావు గెలుపుకోసం ఎలాంటి వ్యూహం పన్నబోతున్నారు..?
తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని మంత్రి హరీష్ రావుకు దుబ్బాక ఉప ఎన్నిక ఓటమిని పరిచయం చేసింది. సునాయాసంగా గెలుస్తామనుకున్న దుబ్బాక పరాజయం ఒక్కసారిగా ఆలోచలో పడేసింది. దీంతో సంగారెడ్డి జిల్లా పరిథిలోని మూడు జీహెచ్ఎంసీ వార్డుల్లో గెలిచి ఓటమిని మర్చిపోవాలని మంత్రి హరీష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించేందుకు హరీష్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
ఆ ప్రణాళికలో భాగంగానే అందరికంటే ముందుగా మంత్రి హరీష్ రావు కార్యక్షేత్రం లోకి దిగారు. సోమవారం పఠాన్ చెరు, రామచంద్రపురం, భారతి నగర్ పరిధిలోని బూత్ స్థాయి కమిటీలతో మంత్రి సమావేశమై నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో పనిచేసిన గజ్వెల్, ఆందోల్, సిద్దిపేట, సంగారెడ్డి నియోజకవర్గాల నేతల సేవలను ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు.
మరోవైపు భారతి నగర్ డివిజన్ ఇంచార్జ్ గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను, రామచంద్రా పురం ఇంచార్జ్‌గా గజ్వెల్‌కు చెందిన ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరూ ప్రతాప్ రెడ్డికి, పఠాన్ చెరు డివిజన్‌కు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బక్కీ వెంకటయ్య లను నియమిస్తున్నట్లు ప్రకటించారు. వీరంతా స్థానిక నేతలతో సమన్వయంలో ఉండాలని ఆదేశించారు. దుబ్బాకలో నేర్చుకున్న పాఠాలు, ఓటమి కసితో ఉన్న ఈ నాయకులకు తిరిగి జీహెచ్ఎంసీ డివిజన్ బాధ్యతలు అప్పగించడం వ్యహాత్మకంగా కనబడుతోంది.
దుబ్బాకలో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకుని, అటు ప్రచారాన్ని ఎలా ఉదృతం చేయాలన్న దానిపై కూడా హరీష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి హరీష్ రావు ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.