Earthquake In Hyderabad : రెండ్రోజుల క్రితమే హైదరాబాద్ లోని బోరబండ, రహ్మత్ నగర్, సైట్-3 ఏరియాల్లో భూమి కంపించి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే విధంగా మరోసారి హైదరాబాద్ నగరంలో భూప్రకంపనలు వచ్చాయి. పెద్ద పెద్ద శబ్దాలతో బోరబండ ప్రాంతంలో మళ్లీ భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఓసారి శబ్దాలు వస్తున్నట్లు స్థానికులు వెల్లడించారు. కొన్ని రోజులుగా వరుసగా భూమి పొరల నుంచి శబ్దాలు వస్తుండడంతో బోరబండ ప్రజల్లో ఆందోళన నెలకొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 0.8 నమోదయినట్లు ఎన్‌జీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయ భ్రాంతులకు లోనవుతున్నారు.
ఇక అక్టోబరు 2న వచ్చిన ప్రకంపనల 1.4 తీవ్రత ఉండగా.. ఇవాళ మాత్రం 0.8 తీవ్రత నమోదయింది. భూకంప తీవ్రతను కొలిచేందుకు మూడు ప్రాంతాల్లో సిస్మోగ్రాఫ్ పరికరాలను ఏర్పాటు చేశారు. బోరబండ ప్రాంతం ఎత్తైన గుట్టల ప్రాంతంలో ఉండడంతో భూమి లోపలి పొరల్లో ఏర్పడే సర్దుబాట్ల కారణంగానే శబ్దాలు వస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం వచ్చిన శబ్దాలతో NGRI అధికారులు బోరబండలోని పలు కాలనీల్లో పర్యటించారు. నీటి ఒత్తిడి ఎక్కువై గాలి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా శబ్దం రావడం సహజం అంటున్నారు అధికారులు.