MHRD Survey On Schools Reopen: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఇప్పటి వరకు పాఠశాలలు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్ధులంతా ఇండ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే 2020-21 విద్యాసంవత్సరంలో స్కూళ్లను ప్రారంభించాలా? ప్రారంభిస్తే ఎప్పట్నుంచి ప్రారంభించాలి? ఆఫ్‌లైన్‌లో తెరవాలా? ఆన్‌లైన్‌లోనా? ఏ విధంగా విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలి? అనే అంశాలపై సేకరిస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రుల వద్ద నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు జిల్లాల నివేదికలు విద్యాశాఖకు అందినట్టు సమాచారం. బలవంతంగా స్కూళ్లు ప్రారంభిస్తే తాము, తమ పిల్లలు బాధపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఇక పోతే వరంగల్‌కు చెందిన 612 మంది తల్లిదండ్రులు ఈ విద్యాసంవత్సరం రద్దుచేయాని జీరో ఇయర్ చేయాలని కోరుతున్నారు. నవంబర్‌లో ప్రారంభించాలని 338 మంది, అక్టోబర్‌లో ప్రారంభించాలని 289 మంది, ఆగస్టులో ప్రారంభించాలని 366 మంది, సెప్టెంబర్‌లో ప్రారంభించాలని 412 మంది కోరారు.
విద్యార్థులందరికీ మాస్కులు పంచాలని 1,981 మంది, స్కూళ్లలో ప్రతిరోజు శానిటైజ్ చేయాలని 1,956 మంది, ప్రత్యేక ఫర్నిచర్ ఏర్పాటుచేయాలని 783 మంది, చేతులు కడుక్కోవడం, రక్షిత మంచినీటిని అందించాలని 897 మంది, మరుగుదొడ్ల సదుపాయాలు పెంచాలని 1,011 మంది, రోజు విడిచి రోజు స్కూళ్లు పెట్టాలని 693 మంది, శానిటైజ్ చేయాలని 2,017 మంది పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లను యథావిధిగా కొనసాగించాలని 426 మంది, షిఫ్ట్ విధానంలో స్కూళ్లను నడిపించాలని 898 మంది తల్లిదండ్రులు తెలిపారు.
ఇక రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 1,232 మంది తల్లిదండ్రుల నుంచి కూడా అధికారులు అభిప్రాయాలు సేకరించగా వారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉన్నాయి. వారిలో 236 మంది తల్లిదండ్రులు ఆగస్టు నుంచి స్కూళ్లను ప్రారంభించాలని పేర్కొన్నారు. కొవిడ్-19 నియంత్రణకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూళ్లకు విజిటర్లను రాకుండా నియంత్రించడంలో కఠినంగా ఉండాలని కోరారు. షిప్ట్ పద్ధతులో తరగతులు. తల్లిదండ్రులు విద్యార్థులకు నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని అడిగారు. ప్రతిరోజూ ఉదయాన్నే నిర్వహించే అసెంబ్లీని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. స్కూల్ యూనిఫారంతోపాటు మాస్కులను తప్పనిసరిచేయాలన్నారు. ఆటస్థలంలో ఆటలు ఆడించవద్దని అభిప్రాయపడ్డారు. సిలబస్‌ను రేషనలైజేషన్ చేయాలని విజ్ఞప్తిచేశారు. అన్ని స్కూళ్లలో ఆరోగ్య కార్యకర్తలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని, టీచర్లు రోజు విడిచిరోజు స్కూళ్లకు వచ్చేలా నిబంధనలు రూపొందించాలని కోరారు.
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను పునః ప్రారంభించడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నది. వైరస్ వ్యాప్తి తగ్గితే సెప్టెంబర్, అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో తెరువొచ్చని సూచిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలను తెరువద్దని, జీరో ఇయర్ చేయాలని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తున్నది.