విషాదం: మేడారం పూజారి కుటుంబాన్ని చిదిమేసిన కరోనా.. అనాథలుగా మారిన చిన్నారులు

Medaram: కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో విషాదం నింపింది.

Update: 2021-06-01 11:17 GMT

విషాదం: మేడారం పూజారి కుటుంబాన్ని చిదిమేసిన కరోనా.. అనాథలుగా మారిన చిన్నారులు

Medaram: కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో విషాదం నింపింది. పదహారు రోజుల వ్యవధిలో భార్యా భర్తలను పొట్టనబెట్టుకుని అభం శుభం తెలియని చిన్నారులను కన్నవారిని దూరం చేసింది. దీంతో అమ్మానాన్నలు ఎప్పుడొస్తారనే ఎదురుచూస్తోన్న ముక్కుపచ్చలారని పసి జీవితాలను చూసి ఆ కుటుంబం గుండెలవిసేలా ఏడుస్తోంది.

ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారి సమ్మారావు కుటుంబాన్ని కరోనా చిదిమేసింది. సమ్మారావుతో పాటు అతని భార్యను కడతేర్చి వారి పిల్లలను అనాథలను చేసింది. నెలరోజుల క్రితం బార్యాభర్తలిద్దరికీ కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఒక వారం పాటు చికిత్స పొందారు. వారం తర్వాత దంపతులు ఇంటికి రావడంతో ఎంతో సంతోషపడింది ఆ కుటుంబం. కానీ అంతలోనే సమ్మారావు భార్య సృజనకు శ్వాస సమస్యల తలెత్తాయి. హన్మకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 11 న కన్నుమూసింది.

భార్య చనిపోయిన బాధను దిగమింగుకున్న సమ్మారావు పిల్లల బాధ్యత తీసుకున్నాడు. అమ్మ ఏదని అడిగిన పిల్లలకు నచ్చజెపుతూ వచ్చాడు. అంతలోనే కరోనా రక్కసి ఆ తండ్రి ప్రాణాలను కూడా తీసుకెళ్లింది. లోలోపల కుములుతూ అనారోగ్యం బారిన పడిన సమ్మారావు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకి మే 25 న కన్నుమూశాడు. దీంతో సమ్మారావు కుటుంబం తీరని విషాదంలో నిండిపోయింది. తల్లి దండ్రులు ఇద్దరు లేరని ఆ పిల్లలకు ఎలా చెప్పాలని బంధువులు గుండెలు బాదుకున్నారు. తల్లీదండ్రులను కోల్పోయిన ఆ పసిపిల్లల బాగోగులు ఇప్పుడు తాత, నానమ్మలు చూస్తున్నారు. సమ్మారావు కుటుంబాన్ని, అతని పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు అతని బంధువులు.

Full View


Tags:    

Similar News