Medaram Jatara 2024 : అసలు ఎవరి గట్టమ్మ తల్లి.. ఆ చరిత్ర ఏంటో తెలుసా?

Gattamma Thalli: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయం దగ్గర పడుతోంది.

Update: 2024-02-16 15:30 GMT

Medaram Jatara 2024 : అసలు ఎవరి గట్టమ్మ తల్లి.. ఆ చరిత్ర ఏంటో తెలుసా?

Gattamma Thalli: తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమయం దగ్గర పడుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలిరానుండగా.. వచ్చే భక్తులంతా ముందుగా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ తరువాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తరలుతుంటారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నప్పటికీ మేడారం వెళ్లే భక్తులు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. అమ్మవారికి మొదటి మొక్కుల తల్లిగా పేరుంది. మేడారం వెళ్లే భక్తులతో పాటు ప్రతి వాహనం ఇక్కడ ఆగి మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం విరాజిల్లుతుండటంతో గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తుంటారు. అసలు వీరవనితల చరిత్రలో గట్టమ్మ ఎవరు.. ఆ తల్లి చరిత ఏంటో తెలుసుకుందాం.

సమ్మక్క–సారలమ్మల చరిత్రపై వివిధ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాగా కొంతమంది చరిత్రకారులు చెబుతున్న ప్రకారం.. క్రీ.శ.12వ శతాబ్ధంలో ఓరుగల్లును పాలిస్తున్న ప్రతాపరుద్రుడు రాజ్యకాంక్షతో పగిడిద్దరాజుపై దండెత్తుతాడు. యుద్ధపోరులో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందగా.. పరాజయ భావంతో జంపన్న సంపెంగ వాగులో దూకి చనిపోయాడు. సమ్మక్క వీరోచిత పోరాటం చేయగా.. కాకతీయుల సైన్యాధిపతి అయిన యుగంధరుడు వెనుకనుంచి వచ్చి పొడవడంతో తీవ్రంగా గాయపడిన సమ్మక్క సైన్యానికి చిక్కకుండా అడవిలోకి వెళ్తుంది. చిలకలగుట్ట వైపు వెళ్లిన సమ్మక్క కోసం గిరిజనులు ఎంత వెదికినా ఫలితం లేకపోయింది. చివరకు ఓ చెట్టు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర కుంకుమ భరిణె కనిపించింది. ఈ కుంకుమ భరిణెనే సమ్మక్కగా భావించి, అప్పటినుంచి గిరిజనులు జాతర చేసుకోవడం ప్రారంభించారు. కాగా యుద్ధంలో సమ్మక్కకు అంగరక్షకులుగా గట్టమ్మ తల్లి, సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు ఉన్నారు. కాగా గట్టమ్మ తల్లి ధైర్య, పరాక్రమాలతో శత్రువులతో సమ్మక్కతో పాటు వీరోచితంగా పోరాడింది. దీంతోనే ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసీ గిరిజన కోయవీరులు అమరులైనప్పటికీ వారందరికన్నా గట్టమ్మ తల్లికి ఘనమైన కీర్తి దక్కింది. సమ్మక్కకు నమ్మిన బంటుగా గట్టమ్మ తల్లి కొనసాగడం కూడా ఇందుకు కారణమైంది.

శ్రీరాముడికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుడు, శివుడికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటుండగా.. అదే మాదిరిగా ఇక్కడి గిరిజనులు సమ్మక్కకు నమ్మిన బంటుగా ఉన్న గట్టమ్మ తల్లి కూడా పూజలు చేయడం ప్రారంభించారు. ముందుగా గట్టమ్మకు కోర్కెలు విన్నవించుకుంటే వాటిని అమ్మవార్ల దృష్టికి తీసుకెళ్తుందని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. అందుకే మేడారం దారిలో ములుగు సమీపంలోని ఎత్తైన గుట్టపై గట్టమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి, మొదటి మొక్కులు ఇక్కడే సమర్పిస్తుంటారు. మేడారం మహాజాతరకు వెళ్లే ప్రతి ఒక్కరూ ఇక్కడ గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తరువాతే వన దేవతలైన సమ్మక్క–సారలమ్మకు మొక్కులు అప్పజెప్తుంటారు. అంతేగాకుండా ఇక్కడ గట్టమ్మ తల్లికి మొదటి మొక్కులు చెల్లించి వెళితే ఆ తల్లి క్షేమంగా ఇంటికి చేరుస్తుందని విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది.

గట్టమ్మ తల్లికి గిరిజన సంప్రదాయంలో నాయకపోడు పూజారులు పూజలు నిర్వహిస్తారు. కాగా మేడారం మార్గంలోని గండికామారం, కాల్వపల్లి, జంగాలపల్లి తదితర ప్రాంతాల్లో గట్టమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించి నాయక పోడు పూజారులు కొలుస్తున్నారు. గట్టమ్మను పూజించడంలో నాయక పోడుల ఆచార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. రెండేళ్లకోసారి జరిగే మహాజాతర, మినీ మేడారం జాతరల సందర్భంగా ఇక్కడ ఎదురుపిల్ల ఉత్సవంతో గట్టమ్మను నాయక పోడులు పూజిస్తారు. ఈ ఎదురుపిల్ల ఉత్సవం తరువాతే మేడారం జాతరకు సంబంధించిన పనులు ప్రారంభమవుతుంటాయి. ఇదిలాఉంటే ఓ వైపు ఆదివాసీ నాయకపోడులు గట్టమ్మను తమ ఇలవేల్పుగా కొలుస్తుండగా.. మరోవైపు జాకారం గ్రామానికి చెందిన ముదిరాజులు తమ కులదైవంగా భావిస్తుంటారు.

ఈ నెల 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుండగా.. మరో వారంలోనే ఎదురుపిల్ల ఉత్సవం నిర్వహించేందుకు నాయక్ పోడులు సన్నద్ధం అవుతున్నారు. వన దేవతలకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులు మొదటి మొక్కులు గట్టమ్మ తల్లికి చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే తల్లిగా విరాజిల్లుతున్న గట్టమ్మ తల్లి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తరువాత ఇక్కడి నుంచి ప్రయాణమై మేడారం వెళ్తున్నారు. దీంతో గట్టమ్మ తల్లి ఆలయం వద్ద కొద్దిరోజులుగా ఫుల్ రష్ కనిపిస్తోంది. ఈ మేరకు ఆలయం వద్ద ఏర్పాట్లు చేసేందుకు అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News