Sankaranthi special: మరో క్రీడాపోటీకి సిద్ధమవుతోన్న మహబూబ్‌నగర్
* సంక్రాంతి సందర్భంగా ఇవాళ్టి నుంచి ఎయిర్ స్పోర్ట్స్ * ఐదురోజుల పాటు జరగనున్న ఎయిర్ స్పోర్ట్స్ ఈవెంట్స్
మహబూబ్‌నగర్ జిల్లా మరో క్రీడా పోటీకి వేదికవుతోంది. ఇప్పటికే కైట్ ఫెస్టివల్‌కు ఆతిథ్యం ఇచ్చిన పాలమూరులో ఈ ఏడాది సంక్రాంతికి పారా మోటారింగ్ చాంపియన్ షిప్ కనువిందు చేయనుంది. ఇందుకు మహబూబ్‌నగర్ స్టేడియంతో పాటు ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇవాళ్టి నుంచి జిల్లా కేంద్రంలో ప్రారంభం కానున్న ఈ పోటీలు ఐదురోజుల పాటు జరగనున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖ ఈ పోటీలను నిర్వహించనుండగా పది రాష్ట్రాల నుంచి పారా మోటారింగ్ క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. గతంలో థాయిలాండ్ లో జరిగిన ప్రపంచ పారా మోటారింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్న నిపుణులు కూడా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ ఛాంపియన్ షిప్ ఏర్పాట్లను వర్టికల్ వరల్డ్ ఎయిరో స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి సుకుమార్ పర్యవేక్షించారు.
ఇక పారా మోటారింగ్ ఛాంపియన్ షిప్‌తో పాటు సంక్రాంతి సాహస విన్యాసాల పేరిట ఎయర్‌షోను కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందుకోసం పారా మోటార్లు, స్కై డైవింగ్, హాట్ ఎయిర్ బెలూన్లు జిల్లాకు తరలివచ్చాయి.
ప్రతీ ఈవెంట్‌లో పాల్గొనడానికి చార్జీలు కూడా వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. పది నిమిషాల పాటు పారా మోటరింగ్ చేయడానికి 15 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్‌కు 5 వందల రూపాయలుగా నిర్ధారించారు.