మహిళలకు ఉపాధి కల్పిస్తున్న సీతాఫలాల ప్రాసెసింగ్
సీతాఫలాలు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఎంత తిన్నా తనివి తీరదు.
సీతాఫలాలు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఎంత తిన్నా తనివి తీరదు. అలాంటి సీతాఫలాల నుంచి గుజ్జు తీసి శుద్ధి చేసి విక్రయిస్తే మంచి లాభాలను అర్జించవచ్చని మహబూబ్ నగర్ జిల్లా పేదరిక నిర్మూలణ సంస్థ సెర్ఫ్ నిరూపిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలో సీతాఫలం విరివిగా దొరుకుతుంది. దీనిని క్యాష్ చేసుకోవాలని ఆలోచించిన సెర్ఫ్ సంస్థ సీతాఫలం ప్రొసెసింగ్ యూనిట్ ను ప్రారంభించింది. దీంతో రైతులు, మహిళలకు ఉపాధి లభించడమే కాకుండా, మహిళా సంఘాలకు ఆర్ధిక స్వాలంభన కల్పిస్తోంది.
నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సీతాఫలం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులు తీసుకొచ్చే సీతాఫలాలను ఎ, బి, సి గ్రేడ్లుగా విభజించి ఏ రసాయనాలను కలపకుండా గుజ్జును తయారు చేసి విక్రయిస్తారు.
గ్రేడ్లను బట్టి కిలో పళ్లను 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు చెల్లిస్తారు. అలా సేకరించిన సీతాఫలాలను రెండు రోజులపాటు మాగబెడతారు. యంత్రాల సహాయంతో గుజ్జులోంచి గింజను వేరు చేసి కిలో ప్యాకెట్లను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన సీతాఫలం గుజ్జును ఐస్ క్రీమ్ కంపెనీకి కేజీ 180 నుంచి 220 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మహిళాసంఘాలకు చెందిన 40 మంది మహిళలు ఈ యూనిట్ లో ఉపాధి పొందుతున్నారు. జామ, మామిడి ప్రొసెసింగ్ కూడా ప్రారంభిస్తే తమకు ఏడాది పొడవునా ఉపాధి లభిస్తుందని ఈ మహిళలు అంటున్నారు.