Madhapur Drugs Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న మాదాపూర్ డ్రగ్స్ కేసు

Madhapur Drugs Case: వ్యాపార, సినీ ఇండస్ట్రీలో పలువురికి కెల్విన్ డ్రగ్స్ సప్లై

Update: 2023-09-20 14:00 GMT

Madhapur Drugs Case: టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న మాదాపూర్ డ్రగ్స్ కేసు

Madhapur Drugs Case: టాలీవుడ్‌ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం షేక్ చేస్తోంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతుండడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడుతోంది. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొందరు డ్రగ్స్ పెడ్లర్లుగా మారి అమ్ముతున్నట్లు తేలింది.

గత కొన్ని నెలలుగా ఈ డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ మధ్య నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడంతో మరోసారి టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఎంతోమంది స్టార్లు ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయం తెల్సిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో ప్రస్తుతం టాలీవుడ్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో పోలీసులు హీరో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.

అసలు నవదీప్‌కు డ్రగ్స్ అందేలా వెనక నుంచి నడిపిస్తున్నదెవరు. నవదీప్ తరహాలో ఇంకెందరు టాలీవుడ్ సెలబ్రిటీలు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సేవిస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో టాలీవుడ్‌ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లయ్ చేయడం ప్రకంపనలు సృష్టించింది. అయితే ఆ కేసులో పోలీసులు కొందరికి క్లీన్‌చిట్ ఇచ్చారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

గోవా సెంటర్‌గా హైదరాబాద్‌కు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కెల్విన్ వెనక ఉండి నడిపించిన ఆ అదృశ్య శక్తి ‎ఎవరన్నది సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ వ్యవహారం తెరమీదకు రావడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అసలు డ్రగ్స్ సప్లయ్‌ను ముందుండి నడిపించేదెవరు? డ్రగ్స్ సరఫరాలో చర్యలు తీసుకుంటే ఇంకా ఎందుకు నియంత్రించలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంలో డ్రగ్స్ పెడ్లర్స్‌కి అధికారులే సపోర్ట్‌గా ఉంటూ తెర వెనుక సినిమా నడిపిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

గత నెల 31న మాదాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో నార్కొటిక్ బ్యూరో 13 మందిని అరెస్ట్ చేసింది. హీరో నవదీప్ కూడా తనతో కలిసి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు అరెస్ట్ చేసిన రామ్‌చంద్ అనే వ్యక్తి విచారణలో తెలిపాడు. దీంతో పోలీసులు డ్రగ్స్ కేసులో పోలీసులు నవదీప్‌ను కూడా నిందితుడిగా చేర్చారు. ఇందులో భాగంగానే ఈ నెల 16న హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కొటిక్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు.

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటకురావడంతో ఇటీవల నవదీప్‌ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్‌ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, డ్రగ్స్‌ వినియోగదారుల జాబితాలో తనను కూడా అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్‌ హైకోర్టులో సెప్టెంబర్‌ 15న పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్‌ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.

ఈ క్రమంలో ఇవాళ నవదీప్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు షాకిచ్చింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని అతను వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్పోజ్‌ చేసింది. 41 ఏ కింద నవదీప్‌కు నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చని తెలిపింది. అలాగే డ్రగ్స్‌ కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని నవదీప్‌ను ఆదేశించింది. నవదీప్‌ను విచారిస్తే టాలీవుడ్‌లోని మరికొందరి సెలబ్రిటీల పేర్లు బయటికొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

అసలు డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌లోని ప్రముఖలు ఇంకా ఎవరెవరున్నారు అనేదానిపై చర్చ జరుగుతోంది. విచారణలో ఎవరి పేర్లు వెలుగులోకి వస్తాయనేది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సినీ నిర్మాతలు, మోడల్స్, పబ్‌ల నిర్వాహకులతో సన్నిహితంగా మెలిగే వారినీ పోలీసులు ప్రశ్నించే అవకాశాలున్నట్టు సమాచారం.

Tags:    

Similar News