Lockdown in Telangana: తెలంగాణలో రెండోరోజు లాక్‌డౌన్‌.. బ్యాంకు పనివేళల్లో మార్పు

Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ రెండోరోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు వాణిజ్య, వ్యాపారాలు, రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Update: 2021-05-13 04:50 GMT

బ్యాంకు పనివేళల్లో మార్పు

Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ రెండోరోజు కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు వాణిజ్య, వ్యాపారాలు, రవాణాకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఉదయం 6 గంటలకే రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. 10 గంటల తర్వాత రద్దీగా కనిపించే మార్కెట్లు జనాలతో కళకళలాడుతున్నాయి. మామూలు రోజుల్లో ఉదయం 11 గంటలకు తెరుచుకునే దుకాణాలు, మాల్స్‌.. తెల్లవారుజామునే ఓపెన్‌ అవుతున్నాయి.

ఉదయం 6 గంటల నుంచే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ప్రజలు సూపర్‌ మార్కెట్లు, రైతు బజార్లకు పరుగులు పెడుతున్నారు. దుస్తులు, పూలు, పండ్ల దుకాణాల దగ్గర భారీగా క్యూ కడుతున్నారు. 10 గంటలకు దుకాణాలన్నీ మూత పడుతుండడంతో ఉదయాన్నే నిద్రలేచి షాపులకు ఎగబడుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా భారీ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు.

ఒకప్పుడు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య రోడ్లపై వాహనాల రద్దీ ఉండేది. కానీ లాక్‌డౌన్‌ దెబ్బతో ఉదయం 6 నుంచే రాకపోకలు సాగిస్తున్నారు భాగ్యనగర వాసులు. దీంతో ఎటు చూసినా ట్రాఫికే కనబడుతోంది. లాక్‌డౌన్‌ ప్రకటనతో ముందస్తుగానే మందుబాబులు మద్యాన్ని కొని తెచ్చి ఇళ్లల్లో దాచి పెట్టుకున్నారు. దీంతో వైన్‌ షాపులు, బార్లు వెలవెలబోతున్నాయి. అలాగే చికెన్‌, మటన్‌కు కూడా గిరాకీ తగ్గింది.

మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల పనివేళ్లలో మార్పులు జరిగాయి. ఇవాళ్టి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ నెల 20 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నట్టు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించగా ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి వచ్చి గుంపులు గుంపులుగా సంచరించడం భయాందోళనకు గురిచేస్తోంది. మాస్క్‌, భౌతికదూరం పాటించకుండా ఒకరిపై ఒకరు పడడంతో మరోసారి వైరస్‌ విరుచుకుపడే అవకాశం ఉంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తూ కరోనా కట్టడికి ముందుకు రావాలని HMTV కోరుకుంటోంది.

Tags:    

Similar News