Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం

Liquor Sales: తెలంగాణలో ఓవైపు ఎన్నికల హడావుడి పెరిగిపోతుంటే.. మరో వైపు భారీ ఎత్తున మద్యం ఏరులై పారుతోంది.

Update: 2023-10-28 14:45 GMT

Assembly Elections 2023: తెలంగాణలో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం

Liquor Sales: తెలంగాణలో ఓవైపు ఎన్నికల హడావుడి పెరిగిపోతుంటే.. మరో వైపు భారీ ఎత్తున మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడికక్కడ భారీగా మద్యం పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్‌ వచ్చిన నాటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే పంపిస్తున్నారు. మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. ఆధారాలు చూపకుండా రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు ప్రతి రోజు సీజ్‌ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ వచ్చాక.. ప్రతి రోజు భారీగా మద్యం పట్టుబడుతోంది. ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని సీజ్‌ చేశారు. ఇప్పటివరకు తాము సీజ్‌ చేసిన మద్యాన్ని సంబంధిత అధికారులకు అప్పగించారు పోలీసులు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బెల్ట్‌ షాపుల దందా మూడు బాటిళ్లు.. ఆరు బీర్ల అమ్మకంగా తయారైంది. సాధార‌ణ స‌మ‌యాల్లో ఎక్సయిజ్ శాఖ అధికారుల అండదండలతోనే వైన్‌షాపుల‌ను త‌ల‌పించే విధంగా దందా సాగిస్తున్న బెల్ట్‌షాపు ఓన‌ర్లు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పెద్దగా వెన‌క‌డుగు వేయ‌క‌పోవ‌డం.. వైన్‌షాపుల‌కు అనుబంధంగా న‌డుస్తున్న బెల్ట్‌షాపులు ఇంకా ద‌ర్జాగా అమ్మకాలు సాగిస్తుండ‌టం గ‌మ‌నార్హం... పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు నిత్యం దాడులు నిర్వహిస్తూ ల‌క్షల విలువ చేసే మ‌ద్యాన్ని ఆయా జిల్లాల్లో ప‌ట్టుకుంటున్నారు. అయితే ఎన్నిక‌ల గిరాకీ కూడా కాస్త ఎక్కువ‌గానే ఉండ‌డంతో సాధార‌ణ స‌మ‌యంలో కంటే ఇప్పడు ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిర్వహణ జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ బెల్ట్ షాపులు యధావిధిగా కొనసాగుతుండటం, పైగా బెల్ట్‌షాప్ నిర్వాహకులను ప్రోత్సహించేలా వైన్‌షాపుల యజమానులు క్రెడిట్‌పై మద్యం సరఫరా చేస్తూ... ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నా ఎక్సయిజ్ అధికారులు బెల్ట్‌షాపులను అదుపు చేయడం లేదు. నామమాత్రపు దాడులు నిర్వహిస్తూ మొద్దునిద్రలో జోగుతున్నారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం లైసెన్సు పొందిన వైన్‌షాప్ మినహా ఎలాంటి బెల్ట్‌షాపులు నిర్వహించడానికి వీలు లేదు. కానీ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణ యథాతథంగా కొనసాగుతోందని, బెల్ట్ షాపులు కొనసాగడానికి చాలావరకు వైన్ షాప్ యజమానులే బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతూ... తమ ఆదాయానికి లోటు లేకుండా చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువగా అమ్ముడుపోయే బ్రాండ్ల మద్యాన్ని బెల్టు షాపులకు ఇచ్చి... వైన్ షాపులో కావాలని కొరత సృష్టిస్తున్నారని, మద్యం కోసం వచ్చిన వారిని బెల్టు షాపులకు వెళ్లేలా చేస్తున్నారని, వైన్ షాప్ యజమానులు తమ లాభాల కోసం బెల్ట్ షాపుల నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నారని సమాచారం.. ఇంతకుముందు ఒక్కో గ్రామంలో 10 నుంచి 20 వరకు ఉన్న బెల్టు షాపులను అలాగే కొనసాగిస్తూ... పైకి మాత్రం బెల్ట్ షాపులకు మద్యం అమ్మడం లేదంటూ వైన్ షాప్ యజమానులు నమ్మబలుకుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ మద్యం అమ్మకానికి బెల్ట్ షాపులు మాత్రం కొనసాగుతుండడం.... వీటికి అండగా వైన్ షాప్ యజమానులే ఉండటం గమనార్హం... బెల్ట్ షాపులకు మద్యం అమ్మకుండా చూడాల్సిన వైన్ షాప్ యజమానులు... ఎన్నికల కోడ్ ఉందని బెల్ట్ షాపులను మూసేసిన నిర్వాహకుకులతో ఒప్పందం కుదుర్చుకొని... సదరు బెల్ట్ షాప్ యజమానికి మద్యాన్ని క్రెడిట్ ద్వారా సరఫరా చేస్తున్నారని సమాచారం... మద్యం అమ్మిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారని, తెలిసిన వారికి తప్ప కొత్తవారికి బెల్ట్ షాపుల్లో విక్రయించకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తూ మద్యాన్ని సరఫరా చేయడం, ఎన్నికల కోడ్ పేరు చెప్పి బెల్ట్ షాపుల్లో మద్యం ధర అమాంతం పెంచేసి అమ్ముతుండంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్ముతున్నా... అదుపు చేసే దిశగా ఎక్సయిజ్ అధికారులు కనిపించడం లేదని ఆయా జిల్లాల ప్రజలు భావిస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపు యజమానులు ఎన్నికల కోడ్ పేరు చెప్పి... ఎక్కువ రేట్లకు మద్యాన్ని అమ్ముతున్నప్పటికీ... బెల్ట్ షాపులను కట్టడి చేయాల్సిన ఎక్సయిజ్ అధికారులకు ఈ షాపులు కనిపించడం లేదా... అని ప్రశ్నిస్తున్నారు.... ఎన్నికల కోడ్‌ రాకముందు వ్యవహరించినట్లుగానే... ఇప్పుడు కూడా బెల్ట్ షాపులపై దాడులు చేయకుండా... మద్యం షాపు యజమానులతో చేతులు కలిపారా.. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు గ్రామాల్లో దాడులు ముమ్మరం చేసి... బెల్ట్ షాపులను కట్టడి చేయాలని, బెల్ట్ షాపులకు అండగా ఉన్న వైన్ షాప్ యజమానులపై కూడా కఠినచర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంతేకాకుండా మద్యాన్ని అక్రమంగా రవాణా చేసే సమయంలోనూ వైన్స్ షాపుల యజమానులు వెన్నంటే ఉండి... చెకింగ్ పాయింట్ల వద్ద కాపు కాసిన అధికారులను ఏదో ఓ రకంగా మచ్చిక చేసుకుని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల తనిఖీ బృందాలకు డబ్బు ఆశ చూపి మద్యాన్ని... తాము రహస్య ప్రాంతాల్లో ఏర్పరుచుకున్న గోడౌన్లకు తరలిస్తున్నారు. అంతేకాదు.. ఇంకో అడుగు ముందుకేసి... చెకింగ్ పాయింట్ల వద్ద తని‌ఖీలు నిర్వహిస్తున్న అధికారులకు... తమకు బంధువులు అయిన ఉన్నతాధికారుల పేర్లు చెప్పడం... అనుకూలంగా ఉన్న కొంతమంది సంబంధిత శాఖల అధికారుల చెప్పడంతో చెకింగ్ అధికారులు తలొగ్గుతుండడంతో.. వారి రహస్య ప్రాంతాలకు మద్యాన్ని తరలిస్తున్నారు.

తెలంగాణకు సరిహద్దులో ఉన్న జిల్లాలకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు మద్యాన్ని దొడ్డిదారిన దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా తెప్పించిన మద్యాన్ని.... సాధారణ సమయంలో ఉన్న ధరలకంటే రెట్టింపు చేసి మందుబాబులకు అమ్ముతున్నారు.

Tags:    

Similar News