Telangana: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల కోసం నేతల పోటీ
Telangana: పొత్తులో భాగంగా టీజేఎస్, సీపీఐకి ఎమ్మెల్సీ ఇవ్వనున్న కాంగ్రెస్
Telangana: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పెరుగుతోంది. తమ పార్టీ పవర్‌లో ఉందనే దీమాతో.. ఈసారి కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవాలని పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటాలో రెండు సీట్లు.. ఇతర కోటాలో మరో నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ఆరు స్థానాలకు పోటీ పడే నేతల లిస్ట్ మాత్రం ఎక్కువగానే ఉన్నట్లు టాక్. ఎమ్మెల్యే టికెట్లు దక్కని నేతలందరికీ.. ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్.. ఇప్పుడు ఆ నేతలంతా ఎమ్మెల్సీ సీట్లపైనే కన్నేశారు.
తెలంగాణ శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి కోసం కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర ఉండబోతోంది. అధికార పార్టీ కావడంతో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని పలువురు మాజీ మంత్రులు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా పైరవీలు మొదలుపెట్టారు. ఇటీవలే ఢిల్లీ టూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్‌తో ఎమ్మెల్సీ టికెట్ల అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే పార్టీ కోసం కష్టపడినవారికి, పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి.. కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కడియం శ్రీహరి, జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ నాలుగు ఖాళీ స్థానాలతో పాటు గవర్నర్ కోటాలోనూ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
ప్రస్తుతం శాసనమండలిలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా జీవన్‌రెడ్డి ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శాసనమండలిలో పట్టుకోసం వాగ్ధాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముందు రేవంత్‌రెడ్డి ప్రస్తావించినట్లు సమాచారం. అందుకోసం ఒక లిస్ట్ కూడా సిద్ధం చేసినట్లు టాక్. పార్టీ రూలింగ్‌లో ఉండడంతో పలువురు నేతలు ఢిల్లీ వేదికగా లాబీయింగ్ చేస్తున్నారు.
మరో వైపు అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పేర్లు ఉండి.. బీ ఫామ్ ఇవ్వని నేతలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. లిస్టులో పేరు ప్రకటించి.. బీఫామ్ ఇవ్వకుండా నిలిపివేసిన చిన్నారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ యోచిస్తోంది. ఇక చివరి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక టికెట్ దక్కని నేతల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి. అందులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్, ప్రోటోకాల్ ఛైర్మన్ వేణుగోపాల్, ఎస్టీ సెల్ ఛైర్మన్ బెల్లయ్యనాయక్‌లతో పాటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, మధుయాష్కీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అటు పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఉన్న తీన్మార్ మల్లన్న, పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బండ్ల గణేష్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి పూర్తి సహకారం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక పొత్తులో భాగంగా ఉన్న సీపీఐకి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ లోపాలను విమర్శిస్తూ.. నిజాలను ప్రజలకు వివరించారని.. కాంగ్రెస్ విజయానికి పరోక్షంగా దోహదపడ్డ ప్రజాకవి అందెశ్రీ, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి లాంటి వాళ్ల పేర్లు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం పార్టీ పరిశీలిస్తోంది.
మొత్తంగా ఖాళీగా ఉన్న ఆరు పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ సీటు నాకంటే నాకంటూ పైరవీలు కూడా స్టార్ట్ చేశారు. ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ మాత్రం పదుల సంఖ్యలో ఉంది. వీటిని భర్తీ చేసే క్రమంలో హైకమాండ్ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనుంది. ఇంతకీ ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరనే దానిపైనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందోననే టెన్షన్‌లో ఆశావహులు ఉన్నారు.