Khammam: కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు
Khammam: కార్పొరేషన్ పరిధిలో 50 నుంచి 60కి పెరిగిన డివిజన్లు * ఎన్నికల నిర్వహణకు 2,500 మంది సిబ్బంది నియమకం
Khammam: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్ధుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఖమ్మం నగరంలోని కార్పొరేషన్ పరిధిలో డివిజన్లు 50 నుంచి 60 కు పెరిగాయి. ఈ 60 డివిజన్ల కోసం ఇప్పటికే 60 మంది రిటర్నింగ్, 60 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఎన్నికల నిర్వహణకు 2,500 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
ఖమ్మం కార్పొరేషన్‌కు సంబంధించి మొత్తం 2,81,387 మంది ఓటర్ల కోసం 387 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి కరోనా బాధితులకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు, సైనికులకు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందించనున్నారు. అయితే వీరు ఓటు వేసేటప్పుడు కూడా వీడియో చిత్రీకరణలోనే ఓటు వేయాల్సి ఉంటుంది. దీనికోసం ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లకు గాను 30 డివిజన్లు మహిళలకు రిజర్వు అయ్యాయి. ఎస్టీ, ఎస్సీలో మహిళలకు కేటాయింపు స్వల్పంగా తగ్గినందున జనరల్ కేటగిరీలో మహిళలకు కేటాయింపు పెంచారు.
ఈనెల 30న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగనుంది. ఎక్కడైనా ఉప ఎన్నికలు అవసరమైతే మే 2న నిర్వహించే అవకాశం ఉంటుంది. మే 3న ఉదయం 8గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. నామినేషన్లు వేసేందుకు వచ్చేవారు కొవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు మాస్కు ధరించి రావాలని, ప్రతిపాదితులు, బలపరిచేవారితో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు సూచించారు.