KTR press meet: ఇదేం సంస్కృతి.. నెయిల్ కట్టర్స్‌తో దాడి చేస్తారా ?

Update: 2024-08-24 08:33 GMT

KTR About Congress Women Wing: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్.. కమిషన్ ఎదుట జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. తాను వ్యక్తిగతంగా కమిషన్ ఎదుట హాజరై.. యధాలాపంగా చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే అందుకు తాను విచారం వ్యక్తంచేస్తున్నాను అని అంగీకరించినట్టు తెలిపారు. ఇప్పటికే ఆ విషయంపై మహిళలకు క్షమాపణ చెప్పినట్లు గుర్తుచేశారు.

అయితే, చట్టాన్ని గౌరవించి మహిళా కమిషన్ ఎదుట హాజరవడానికి తాను వస్తే... కాంగ్రెస్ మహిళా నేతలు జనాన్ని వెంటేసుకుని వచ్చి తన వెంట వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులపై దాడి చేయడం బాధాకరం అన్నారు. తాను మహిళా కమిషన్ ఎదుట విచారణలో ఉండగా.. భవనం బయట ఉన్న బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడి చేశారని ఆరోపించారు. నెయిల్ కట్టర్స్‌తో దాడికి పాల్పడినట్లుగా బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు తన వద్ద వాపోయారని అన్నారు. పోలీసుల అండదండలు చూసుకుని కాంగ్రెస్ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

నేనే మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాను

గత 8 నెలలుగా తెలంగాణలో మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న దాడుల గురించి మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేయడం జరిగిందని కేటీఆర్ మీడియాకు తెలిపారు. అయితే, అందుకోసం మరోసారి ప్రత్యేకంగా సమయం తీసుకుని రావాల్సిందిగా మహిళ కమిషన్ తనకు సూచించిందని అన్నారు. కమిషన్ పై తనకు గౌరవం ఉందని.. కచ్చితంగా మరొకసారి సమయం తీసుకుని వారిని కలిసి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ఫిర్యాదు చేయడం జరుగుతుందని కేటీఆర్ స్పష్టంచేశారు. కేటీఆర్ వెంట సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మాలోత్ కవిత తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News