ఈ నెల 20 నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర
* నల్గొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల నుండి ప్రారంభం * బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 % పూర్తి
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర కు సిద్దమయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటు జగ్గారెడ్డిలు పాదయాత్రలకు తేదీలు ఖరారు చేసుకున్నారు.
ఈ నెల 20 నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాత్ర ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంల నుండి హైదరాబాద్ లోని ఇరిగేషన్ కార్యాలయం వరకు ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో పాద యాత్ర చేయబోతున్నారు. 90 శాతం పూర్తి అయిన బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కి 100 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యేది అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ. అటు SLBC టన్నెల్ పనులు కూడా పూర్తి అయితే నల్గొండ జిల్లా సస్యశ్యామలం అవుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లుగా ఎందుకు నిధులు విడుదల చేయడం లేదనే ప్రధాన డిమాండ్ తో హైదరాబాద్ లోని చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇవ్వాలని కోమటిరెడ్డి నిర్ణయించారు. దీంట్లో భాగంగా బ్రాహ్మణ వెల్లెంల లో భారీ సభను ఏర్పాటు చేసి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉత్తమ్... జానారెడ్డి లు ప్రారంభిస్తారు.
మరో సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పాదయాత్ర తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుండి వారం పాటు పాదయాత్ర చేయాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. సదాశివపేట నుండి.. గన్ పార్క్ వరకు పాదయాత్రగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన నియోజకవర్గంలోని మెడికల్ కాలేజీ, సంగారెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలు లాంటి సమస్యలతో పాటు కొనుగోలు కేంద్రాల ఎత్తివేత కు నిరసనగా పాదయాత్ర చేయబోతున్నారు. దీని కోసం పోలీసుల అనుమతి కూడా కోరారు. వరుసగా పార్టీలో సీనియర్ నాయకులు అంతా.. జనంలోకి వెళ్లాడానిక్ సిద్దమయ్యారు. ముగ్గురు నాయకులు పాదయాత్రలు చేస్తుంటే సీఎల్పీ నేత భట్టి రైతు ముఖాముఖి అంటూ రైతు బాట పట్టారు.