టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని కొంత మంది ఆహ్వానించినప్పటికీ మరికొంత మంది దానిపై వ్యతిరేకత చూపుతున్నారు. ఇందులో భాగంగానే హై కోర్టులో లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, టీఆర్‌ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇక పోతే ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో 'ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్' ఎల్‌ఆర్‌ఎస్ అంశంపై పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా అత్యన్నత న్యాయస్థానం లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించి నమోదవుతున్న అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారించనుంది. రాష్ట్రంలోని అన్ని నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల పరిధుల్లోని అనధికారిక ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు తెలంగాణ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రకటించిందని పేర్కొంటున్నారు.