ఉత్తమ్‌కుమార్ సీఎం’ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈ సంచలన ప్రకటన వెనుక అసలు కథ ఏంటి?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Update: 2024-08-30 15:00 GMT

Komatireddy Raj Gopal Reddy

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. శుక్రవారం భువనగిరిలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో ఉత్తమ్ ను సీఎం అంటూ పిలిచారు. ఆ వెంటనే తేరుకుని మంత్రిగారు అని సంభోదించారు. మీరు ఎప్పుడో ఒక్కసారి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. నా నాలుక మీద మచ్చలున్నాయి. నేను చెప్పింది తప్పకుండా అవుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే ఆయనకు సీఎం పదవి మిస్సయిందన్నారు.

అనుకోకుండా అన్నారా... కావాలనే కామెంట్ చేశారా?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సహజంగానే తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ ఏర్పడిందనే ప్రచారం కూడా ఒకవైపు సాగుతున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ సర్కార్ అదానీ కంపెనీని ఆహ్వానించడంపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదానీతో రేవంత్ రెడ్డికి సాన్నిహిత్యం ఉందని, అదే రాహుల్ గాంధీకి ఆయనకు మధ్య గ్యాప్ పెంచుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఉత్తమ్ ను పొగడడం వెనుక

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే, మంత్రివర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుండి ఇంకా క్లియరెన్స్ రాలేదు.

కేబినెట్లోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయమై ఏకాభిప్రాయం రాలేదు. దీంతో మంత్రివర్గవిస్తరణ వాయిదా పడుతోంది. పీసీసీ అధ్యక్ష పదవిని భర్తీ చేసిన తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్నారు.

ఒకే కుటుంబం నుంచి మరొకరికి మంత్రి పదవి ఇస్తే ఇతరుల నుంచి కూడా ఇదే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారనే ప్రచారం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో బహిరంగంగానే వినిపిస్తోంది. దీంతో ఉత్తమ్ ను ప్రసన్నం చేసుకొనేందుకు రాజగోపాల్ రెడ్డి ఆయన సీఎం అంటూ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ కూడా మొదలైంది.

అన్న వెంకటరెడ్డి ఉండగా.. ఉత్తమ్ పేరెందుకు?

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎంకు కావాల్సిన అన్ని అర్హతలున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భవిష్యత్తులో ఎప్పుడైనా సీఎం అవుతారని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆ సభలోనే ఉన్నారు.

తాను ఎప్పటికైన సీఎం అవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నల్లగొండలో చేసిన విజయోత్సవ ర్యాలీలో అన్నారు.

ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకట్ రెడ్డికి బదులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అంటూ చెప్పడంతో అన్నాదమ్ముల మధ్య గ్యాప్ ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఏమైనా, సంచలన ప్రకటనలు చేస్తూ రాజకీయాల్లో కొత్త చర్చలు రేపడం రాజగోపాల్ రెడ్డికి కొత్తేమీ కాదు. మాటా మాట వస్తే సొంత పార్టీ అయినా ప్రతిపక్షానికి చెందిన వారైనా ఆయన స్వరంలో మార్పు ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Tags:    

Similar News