వికారాబాద్ కు పట్నం నరేందర్ రెడ్డి తరలింపు: సురేశ్ తో 42 ఫోన్ కాల్స్ పై ఆరా..
Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ డీటీసీకి ఆయనను తరలించారు.
Patnam Narender Reddy Arrest: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ డీటీసీకి తరలించారు. నవంబర్ 11న లగచర్లకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై స్థానికులు దాడికి దిగారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా బి. సురేశ్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సురేశ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య 42 ఫోన్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గొడవకు ముందు రోజు, గొడవ జరగడానికి గంటల వ్యవధిలో ఈ ఫోన్ కాల్స్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ గురించి జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆయనను ప్రశ్నిస్తున్నారని సమాచారం.
అసలు ఏం జరిగింది?
వికారాబాద్ జిల్లా దుద్యాల, లగచర్ల గ్రామాల మధ్య ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం నవంబర్ 11న ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయసేకరణ జరిగే ప్రాంతానికి రైతులు, ప్రజలు ఎవరూ రాలేదు. అసలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు లగచర్లకు రావాలని సురేశ్ కోరారు. సురేశ్ మాట విన్న కలెక్టర్ సహా అధికారులు గ్రామానికి వెళ్లారు.అధికారులు గ్రామానికి చేరుకోగానే వారికి వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. కలెక్టర్ సహా ఇతర అధికారులను వెనక్కు నెట్టారు. తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్‌లను అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు. కడా అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు దాడికి దిగారు. అడ్డుకోబోయిన డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి.
పరారీలో సురేశ్
ఈ ఘటనకు అనుమానితుడిగా ఉన్న సురేశ్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. సురేశ్ ఫోన్ కాల్స్‌ను పరిశీలించిన సమయంలో పట్నం నరేందర్ రెడ్డికి సురేశ్‌కు మధ్య జరిగిన మొబైల్ కాల్స్ అంశాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఫోన్ కాల్స్‌పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ కార్యకర్త కావడంతో సురేశ్ ఫోన్ చేసినట్టుగా పట్నం నరేందర్ రెడ్డి నవంబర్ 12న మీడియాకు చెప్పారు. సురేశ్ సోదరుడితో పాటు మరో ముగ్గురిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు.