Telangana: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీ.సర్కార్ కీలక ఆదేశాలు
Telangana: ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే ఎఫ్‌డిలు చేయాలి
Telangana: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో పలు శాఖలు తమ వద్ద ఉన్న నిధులను తమకు ఇష్టం వచ్చిన బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా మారుస్తున్నాయి. ఆ శాఖల ఇన్‌చార్జ్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల తెలుగు అకాడమీకి చెందిన నిధులు దారి మళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే ఎఫ్‌డీలను చేయాలని, ఇతరత్రా బ్యాంకుల్లో ఎఫ్‌డిలను చేయడం కుదరదని పేర్కొంది.
తెలంగాణ సర్కారు తన పరిధిలోని అన్ని శాఖలకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో ఉన్న నిధులను అవసరమైన మేరకు అట్టిపెట్టుకుని.. మిగిలిన మొత్తాలను ఎఫ్‌డీలుగా మార్చాలని, అయితే ఆ ఎఫ్‌డీలను ప్రభుత్వ లీడ్ బ్యాంకులోనే చేయాలని ఆదేశించింది. ఆయా శాఖలు ఇష్టారాజ్యంగా బ్యాంకు ఖాతాలు తెరవడం కూడా ఇకపై కుదరదని, ఆయా శాఖలు బ్యాంకు ఖాతాలు తెరవాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని కూడా ఓ నిబంధన పెట్టేసింది. ఆయా శాఖలకు చెందిన వాడని బ్యాంకు ఖాతాలను తక్షణమే మూసివేయాలని, ఈ వివరాలన్నింటిని అందజేయాలని కూడా తెలంగాణ సర్కారు అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.