KCR: కవిత అరెస్టుపై తొలిసారి స్పందించిన మాజీ సీఎం కేసీఆర్
KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది
KCR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని BRS అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు కొందరు తనతో టచ్‌లో ఉన్నారని, అక్కడ అంతా బీజేపీ పెత్తనమే నడుస్తోందని వారు చెప్పారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని చెప్పారు. గతంలో 104 మంది ఎమ్మెల్యేలున్న మన ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ ప్రయత్నించిందని... 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌ను వదిలిపెడుతుందా అని నాయకులతో అన్నారట. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా గందరగోళం తలెత్తుతుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి అధినేత కేసీఆర్ సరికొత్త పంథా ఎంచుకున్నారు. బస్సు యాత్రం చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.
కవిత అరెస్టు కేసీఆర్ తొలిసారి స్పందించారు. బీఎల్ సంతోష్‌పై కేసునమోదు చేసినందుకే కవితను అరెస్టు చేశారని ఆరోపించారు. సంతోష్‌పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదన్నారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు అని ఆరోపించారు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని ఆరోపించారు.